మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత "మొరాకన్ స్టార్" పురస్కారం తెలంగాణకు చెందిన ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావును వరించింది.
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావు మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత "మొరాకన్ స్టార్" పురస్కారం స్వీకరించారు. కోవిడ్ లాక్ డౌన్ లో ఆయన గీసిన వేలాది బొమ్మలకు, రాసిన ఆంగ్ల కవిత్వానికి ఈ పురస్కారం లభించింది. తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పిగా అభివర్ణిస్తూ పది జాతీయ పురస్కారాలు, తొమ్మిది అంతర్జాతీయ పురస్కారాలు ఇటీవల కాలంలో ఆయన్ని వరించాయి. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు తన వంతు కృషి చేసినట్లు బి. నర్సింగరావు తెలిపారు. తన సాంస్కృతిక ప్రయాణంలో విజయవంతం అయినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు విశిష్ట వ్యక్తుల పేరిట నెలకొల్పిన పురస్కారాలు తనకు లభించాయని సోమవారం బి. నర్సింగరావు మీడియాకు తెలిపారు. రంగస్థలం, సినిమా, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, సాహిత్యం, జానపదం, ఫోటోగ్రఫీ రంగాల్లో ఎన్నో దశాబ్దాలుగా తాను చేసిన కృషికి గుర్తింపు లభించిందని ఆయన సంతోషం వెలిబుచ్చారు. సింగపూర్ కు చెందిన ది ఎలైట్ ఫెడరేషన్ అఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ తనను గుర్తించి అంతర్జాతీయ సాంస్కృతిక గౌరవ సలహాదారులుగా నియమించినట్లు తెలిపారు.
ఆ సంస్థ 160 దేశాలకు విస్తరించి ఉందని ఆయన వివరించారు. మొరాకో దేశం మొరాకన్ స్టార్ పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించిందని నర్సింగరావు తెలిపారు. ఫీలిప్పిన్ దేశం నుంచి కూడా గౌరవ డాక్టరేట్ స్వీకరించినట్లు తెలిపారు. ఇంగ్లాండ్ కు చెందిన ఉమెన్ అఫ్ హార్ట్స్ సంస్థ "ఎ జెంటిల్ మెన్ ఆఫ్ హార్ట్స్" అవార్డు తో సత్కరించినట్లు చెప్పారు. కజకిస్తాన్, వేనెజులా దేశాలు అత్యున్నత పురస్కారాలు ప్రకటించాయి.
దాదాపు ప్రపంచంలోని అన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రత్యేక ప్రశంసలు అందించినట్లు నర్సింగరావు తెలిపారు. తనకు కవిత్వం రాయడం ఇష్టమని, 24 వాల్యూమ్ ల కవిత్వం రాశానని, పది వాల్యూమ్స్ ప్రచురించినట్లు తెలిపారు. ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ రూపొందించిన "ది ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా" గ్రంథంలో తన సినిమాల గురించి ప్రచురించిందని దర్శక రచయిత బి. నర్సింగ రావు తెలిపారు.