నన్ను పార్టీ నుండి పంపించే కుట్ర: కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి

By narsimha lode  |  First Published Nov 21, 2022, 5:39 PM IST

పార్టీ  మారుతున్నానని  తనపై జరుగుతున్న  తప్పుడు  ప్రచారాన్ని  కాంగ్రెస్  పార్టీ  నేత  మహేశ్వర్ రెడ్డి తోసిపుచ్చారు.  తనను  పార్టీ  నుండి  పంపించాలనే  కుట్ర  జరుగుతుందని  ఆయన  ఆరోపించారు. 


హైదరాబాద్: తనను కాంగ్రెస్ పార్టీ నుండి  పంపేందుకు  కుట్ర చేస్తున్నారని  ఎఐసీసీ  కార్యక్రమాల అమలు  కమిటీ  చైర్మెన్  మహేశ్వర్  రెడ్డి  ఆరోపించారు.సోమవారంనాడు  హైద్రాబాద్  లోని గాంధీభవన్ లో  ఆయన మీడియాతో  మాట్లాడారు.  మహేశ్వర్ రెడ్డి  బీజేపీలో  చేరుతున్నారని  కొంతకాలంగా సాగుతున్న  ప్రచారంపై  ఆయన  స్పష్టత  ఇచ్చారు.  నిర్మల్  జిల్లాలో  రామారావు పటేల్  కాంగ్రెస్ పార్టీని వీడితే  తాను  కూడా  పార్టీని  వీడుతానా  అని  ఆయన ప్రశ్నించారు. రామారావు  పటేల్ ను  జానారెడ్డి  కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చారన్నారు.

రామారావు పటేల్  పార్టీ మారితే  జానారెడ్డిని  కూడా అనుమానిస్తారా  అని  మహేశ్వర్  రెడ్డి  ప్రశ్నించారు. ఎవరి స్వార్ధం  కోసం  వాళ్లు  పార్టీ  మారుతున్నారని  చెప్పారు. ప్రతిసారీ  తాను  శీల పరీక్ష  చేసుకోవాలా  అని ఆయన  ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో  కొందరు  దుష్ప్రచారం  చేస్తున్నారని  చెప్పారు. ఇది  మంచిది కాదన్నారు. మర్రి  శశిధర్  రెడ్డి  కాంగ్రెస్ పార్టీపై  చేసిన వ్యాఖ్యలను  మహేశ్వర్  రెడ్డి  తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు  చేయడంపై  ఆయన మండిపడ్డారు. మర్రి  శశిధర్  రెడ్డికి నోటీసులిచ్చే  అంశం  ఎఐసీసీ పరిధిలో  ఉంటుందని  ఆయన  తెలిపారు.. పార్టీ  నుండి  బయటకు  వెళ్లిన  వారిని  సస్పెండ్  చేయడం  కంటే  వారిని  కన్విన్స్  చేయాలని  శశిధర్  రెడ్డి  కోరారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ  ఒక్కొక్కరికి ఒక్కో  న్యాయం  అన్నట్టుగా  వ్యవహరిస్తుందని  చెప్పారు. కొందరిని  పార్టీ  నుండి బహిష్కరించి మరికొందరిని  పట్టించుకోకపోతే  తప్పుడు  సంకేతమివ్వడమేనని  ఆయన  చెప్పారు. టీపీసీసీ  వర్కింగ్   ప్రెసిడెంట్  జగ్గారెడ్డి,  భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డిలు  చాలా  విషయాలు  మాట్లాడారన్నారు.  పార్టీ సమీక్ష సమావేశాల్లో  అన్ని  విషయాలపై  చర్చిస్తామని  ఆయన  తెలిపారు. పార్టీ కీలక నేతలు  చేస్తున్న వ్యాఖ్యలపై సమీక్ష జరగాల్సిన  అవసరం  ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డి  తరహలో తాను  పార్టీ  విషయాలపై  బయట  మాట్లాడబోనని  మహేశ్వర్  రెడ్డి  తేల్చి  చెప్పారు. తెలంగాణలో  బీజేపీకి  ఐదు  శాతం  ఓటింగ్  మాత్రమే  ఉందని  ఆయన  అభిప్రాయపడ్డారు. 

Latest Videos

ముథోల్  అసెంబ్లీ  స్థానం  నుండి  గత  ఎన్నికల  నుండి  కాంగ్రెస్  అభ్యర్ధిగా  పోటీ చేసిన రామారావు  పటేల్  కాంగ్రెస్ పార్టీకి గుడ్  బై  చెప్పారు. ఈ నెల  28న రామారావు పటేల్  బీజేపీలో చేరనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్ ను  ఇటీవల  ఆయన  కలిశారు. బైంసా  నుండి  బండి సంజయ్  ప్రజా సంగ్రామ  యాత్రను  నిర్వహించనున్నారు. ఈ  సమయంలోనే  రామారావు పటేల్  బీజేపీ  తీర్ధం  పుచ్చుకొనే  అవకాశం  ఉంది. 

also  read:కాంగ్రెస్‌కి మరో షాక్: అనుచరులతో నేడు భేటీ, బీజేపీలోకి రామారావు పాటిల్?

కాంగ్రెస్ పార్టీ  నిర్మల్  జిల్లా  అధ్యక్షుడిగా  ఉన్న  రామారావు  పటేల్  బీజేపీలో  చేరనున్న నేపథ్యంలో  ఏలేటీ  మహేశ్వర్ రెడ్డి  కూడా  బీజేపీలో చేరే అవకాశం  ఉందని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై  మహేశ్వర్  రెడ్డి  మండిపడ్డారు. మాజీ  ముఖ్యమంత్రి  మర్రి చెన్నారెడ్డి  తనయుడు  మర్రి  శశిధర్  రెడ్డి కాంగ్రెస్  పార్టీని  వీడుతున్నారు.ఇటీవలనే   శశిధర్ రెడ్డి  కేంద్ర  హోంశాఖ మంత్రి  అమిత్ షాతో  భేటీ అయ్యారు.  దీంతో  మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ  నుండి  బహిష్కరించారు. ఇదే  సమయంలో మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగడంపై  ఆ పార్టీ వర్గాల్లో  ఆందోళన  నెలకొంది. అయితే  ఈ ప్రచారంలో  వాస్తవం  లేదని  మహేశ్వర్  రెడ్డి  ఇవాళ    ప్రకటించారు. 

click me!