Danasari Anasuya Seethakka: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దానసరి అనసూయ సీతక్క.. ప్రజలంతా ఆశిస్తున్న ప్రజా సంక్షేమ రాజ్యాన్ని తీసుకువస్తామనీ, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Telangana Minister Seethakka: ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. రేవంత్ రెడ్డితో పాటు మరో 10 మంది మంత్రులుగా వివిధ శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముగులు ఎమ్మెల్యే దానసరి అనసూయ సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తామని చెప్పారు. తాను ఏ పదవిలో ఉన్నా, ఎక్కడున్నా ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె తెలంగాణ ప్రజలు తనకు పెద్ద బాధ్యతను అప్పగించారని అన్నారు.
నియంతృత్వాన్ని తరిమికొట్టి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారని కాంగ్రెస్ గెలుపు గురించి ప్రస్తావించారు. ప్రజలందరూ ఆశించిన ప్రజా సంక్షేమ రాజ్యాన్ని తీసుకువస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుంచి 2011 వరకు వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కూడా అమలవుతాయని వివరించారు. సంక్షేమ పాలన అందించడంలో అన్ని వర్గాల మద్దతు ఉండాలనీ, ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని సీతక్క అన్నారు. రోడ్డు రవాణా సమస్యలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు పేదరికంలో కూరుకుపోయారన్నారు. ఆయా సమస్యలను తరమికొట్టడానికి అందరూ కలిసి ముందుకు సాగుదామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి గొప్పతనాన్ని చూపించడానికి బదులుగా తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు సీతక్క ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు.