CM Revanth Reddy అధ్యక్షతన తొలి క్యాబినెట్ మీట్.. ఆరు గ్యారంటీలు, కీల‌క అంశాల‌పై చ‌ర్చ

By Mahesh Rajamoni  |  First Published Dec 7, 2023, 8:19 PM IST

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశమైన రేవంత్.. అటు నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.
 


Telangana Cabinet meeting: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయ‌కుడు అనుముల రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సచివాలయానికి చేరుకుని ఆరో అంతస్తులో ఉన్న తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన భార్యతో కలిసి, పూజారుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై ఆయన సంతకం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రేవంత్ రెడ్డి త‌న మంత్రివ‌ర్గంతో స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై చ‌ర్చించారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప‌లు ప్రజా సమస్యల చ‌ర్చించిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అతిత్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల‌ను అమ‌లు చేమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నాయి.

Latest Videos

అంతకుముందు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం తలుపులు ప్రజల కోసం తెరుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముందు ఉన్న గేట్ల‌ను తొల‌గించ‌డం గ‌మ‌నార్హం. నూతన సచివాలయ సముదాయాన్ని అత్యాధునిక ఫీచర్లతో, ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించి ఏప్రిల్ 30న ప్రారంభించారు. కాగా, తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ స‌ర్కారు కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా దళిత నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు. 

click me!