
హైదరాబాద్: అది ఖమ్మంలోని ఓ సెలూన్ షాప్. నెల రోజుల్లో ఆ షాప్‌లో సాధారణంగా 100 యూనిట్లకు అటూ ఇటూగా విద్యుత్ ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన హామీ కింద 250 యూనిట్లు వాడినా వారు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ హామీ కిందికి తన మీటర్ మార్చుకున్నారు. తొలి మాసం కరెంట్ బిల్లు రాలేదు. కానీ, రెండో నెల విద్యుత్ బిల్లు చూసి ఆ సెలూన్ షాప్ యజమానికి దిమ్మదిరిగిపోయింది. ఏకంగా రూ. 19,671 రూపాయల బిల్లు వచ్చింది.
నాయీ బ్రాహ్మణులు, రజకులు, సెలూన్, లాండ్రీ షాపుల్లో నెలకూ 250 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 250 యూనిట్ల లోపు విద్యుత్ వాడితే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంగా తెలిపింది. ఈ ప్రకటనపై ఆయా వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆ పథకం కింద లబ్దిదారులుగా మారారు. అదే విధంగా ఖమ్మం మదిరలోని సీపీఎస్ రోడ్డులోని ఓ సెలూన్ షాప్ నిర్వాహకుడు కూడా తన మీటర్‌ను ఉచిత మీటర్ కేటగిరీలోకి మార్చాలని దరఖాస్తు పెట్టాకున్నాడు.
సీపీఎస్ రోడ్డులు ఆరేళ్లుగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న నాగులవంచ అప్పారావు మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అధికారులు ఆయనకు ఓ విద్యుత్ మీటర్ అందించారు. అది అంతకు ముందు బడ్డీ కొట్టులో వీరయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నది. సర్వీస్ నెంబర్ 75తో ఉన్న ఆ మీటర్‌ను ఉచిత విద్యుత్ మీటర్‌గా మార్చి అప్పారావుకు అందించారు. తద్వారా అప్పారావు నెలకు 250 యూనిట్లు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవడానికి లబ్దిదారుగా మారాడు.
అంతా బాగానే ఉన్నది. గత ఏడాది నవంబర్‌లో కరెంట్ బిల్లు జీరోగా వచ్చింది. కానీ, డిసెంబర్‌లో మాత్రం బిల్లు 19,671.92గా వచ్చింది. ఈ బిల్లు చూసి అప్పారావు ఖంగుతిన్నాడు. దీన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
తాను రోజంతా కష్టపడినా రూ. 300లు సంపాదించడం చాలా క్లిష్టంగా మారిపోయిందని, అలాంటిది సుమారు రూ. 20 వేల కరెంట్ బిల్లును ఎలా కట్టగలను? అని ఆయన ఆవేదనకు లోనయ్యాడు. దీంతో ఆయన మీడియాను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. ఇప్పటికైనా తన సమస్య పరిష్కరించాలని అధికారులను కోరాడు. ఈ సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదని తెలుస్తున్నది.