తెలంగాణలోని మారుమూల ఆదివాసి గ్రామంలో పుట్టిపెరిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మంత్రి స్థాయికి ఎదిగారు. ఇంతకాలం ఆమె స్వగ్రామానికి బస్సు సదుపాయం లేదంటే నమ్మగలారా..! కాానీ ఇది నిజం.
ములుగు : ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రానికి మంత్రి. ముూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పుట్టిపెరిగిన గ్రామానికి కనీసం ఆర్టిసి సదుపాయం కూడా లేదు. ఇంతకాలం ప్రతిపక్ష పార్టీలో వుండటంతో తన సొంతూరుకు కనీసం ఆర్టిసి బస్సు వేయించుకోలేకపోయారు. కానీ ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ముందుగా తన గ్రామస్తులకు బస్సెక్కించే ఏర్పాట్లు చేసారు. ఇలా సొంతూరుకు బస్సు వేయించుకుంటున్న ఆ మంత్రి ఎవరో కాదు ధనసిరి అనుసూయ అలియాస్ సీతక్క.
ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలోనే మంత్రి సీతక్క పుట్టిపెరిగారు. నక్సలైట్స్ ప్రభావం ఎక్కువగా వుండటం... దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఈ గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం లేదు. అయితే ఇటీవలకాలంలో ఈ ప్రాంతంలో కూడా అభివృద్ది జరిగింది. జగ్గన్నపేటకు రోడ్డు సదుపాయం కూడా మెరుగుపడటంతో ప్రతిపక్షంలో వుండగా సీతక్క బస్సు సౌకర్యం కోసం ప్రయత్నించారు. ఒక్క తన స్వగ్రానికే కాదు ములుగు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సులు నడపాలని వరంగల్ డిపో ముందు సీతక్క ఆందోళన కూడా చేపట్టారు.
అయితే ఎమ్మెల్యేగా సొంత గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించుకోలేపోయారు సీతక్క. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆర్టిసి అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే మంత్రిగారి గ్రామానికి బస్సును తిప్పే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జగన్నపేటకు మీదుగా పత్తిపల్లి-పొట్లాపూర్ మధ్య బస్సు నడిపాలని నిర్ణయం తీసుకున్నట్లు వరంగల్ 2 ఆర్టిసి డిపో మేనేజర్ సురేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ రూట్ ను అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు.
Also Read Telangana : తోటి ఎమ్మెల్యేకు వైద్యం చేసిన మరో ఎమ్మెల్యే...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటయిన 'మహాలక్ష్మి' పథకాన్ని ఇటీవల సోనియా గాంధీ పుట్టినరోజున ప్రారంభించింది. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో మహిళా మంత్రి సీతక్క స్వగ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన వారు జగన్నపేటకు బస్సు నడిపి మంత్రిగారి స్వగ్రామంలోని మహళలకు కూడా మహాలక్ష్మి పథకాన్ని చేరువచేసేందుకు సిద్దమయ్యారు.
ఎన్నోఏళ్లుగా తమ గ్రామానికి బస్సు వస్తుందని ఎదురుచూసి విసిగిపోయారు జగన్నపేట గ్రామస్తులు. చివరకు తమ గ్రామానికి చెందిన ఆడబిడ్డకు మంత్రి పదవి దక్కడం ... ఆమె చొరవతో ఆర్టిసి బస్సు వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిసి బస్సు రానుండటంపై సీతక్క సొంతూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.