జీవన్ రెడ్డీ ... కేవలం వారమే నీకు టైమ్ : ఐపిఎస్ సజ్జనార్ హెచ్చరిక

By Arun Kumar P  |  First Published May 25, 2024, 3:15 PM IST

బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు గడ్డుకాలం మొదలయ్యింది. ఆర్మూర్ మాాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఓ వైపు మాల్ వివాదం... మరోవైపు పోలీస్ కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 


ఆర్మూరు : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిఆర్ఎస్ నాయకులకు కష్టాలు తప్పడంలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ వంటి బిఆర్ఎస్ నాయకులను సైతం వదిలిపెట్టబోమని ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు... మరి మిగతా బిఆర్ఎస్ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ పాలనలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మరీ దారుణంగా తయారయ్యింది. 

ఆర్మూరు బస్టాండ్ సమీపంలో తెలంగాణ ఆర్టిసి స్థలాన్ని లీజుకు తీసుకుని భారీ మాల్ నిర్మించారు జీవన్ రెడ్డి. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఆర్టిసికి లీజు డబ్బులు చెల్లించడంలేదు... దీంతో బకాయిలు కోట్లల్లో పెరిగిపోయాయి. బిఆర్ఎస్ అధికారంలో వుండగా ఆ పార్టీ ఎమ్మెల్యేను బకాయిల గురించి అడిగే ధైర్యం చేయలేకపోయారు ఆర్టిసి అధికారులు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డితో పాటు బిఆర్ఎస్ పార్టీ కూడా ఓటమిపాలయ్యింది... ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి.  

Latest Videos

undefined

కొద్దిరోజుల క్రితం లీజు బకాయిలు చెల్లించాలంటూ ఆర్టిసి అధికారులు మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. తాజాగా ఆర్మూరులోని జీవన్ రెడ్డి మాల్ ను కూడా ఆర్టిసి స్వాధీనం చేసుకుంది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆ మాల్ ను జీవన్ రెడ్డికి అప్పగించినట్లు తెలంగాణ ఆర్టిసి  ఎండి విసి సజ్జనార్ తెలిపారు.  

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు బస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు సజ్జనార్ తెలిపారు.  తెలంగాణ ఆర్టిసికి పెండింగ్‌లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని జీవన్ రెడ్డికి చెందిన విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించినట్లు సజ్జనార్ వెల్లడించారు.  

హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్‌ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు సజ్జనార్ తెలిపారు. భవిష్యత్ లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు.

విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆ షాపింగ్‌ మాల్ లోని సబ్‌ లీజ్‌ దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్‌ను ఓపెన్‌ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని... దీంతో జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం ఆర్టిసి సంస్థ అనుమతి ఇచ్చిందన్నారు. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుందని ఆర్టిసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. 

click me!