తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కార్మిక శాఖ పోలింగ్ తేదీ నవంబర్ 30వ తేదీన వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఫ్యాక్టరీలు, సంస్థల చట్టం-1974, తెలంగాణ షాప్ కాంప్లెక్స్ చట్టం-1988 నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఐ.రాణి కుముదిని జారీ చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో కార్మికులు, ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 29, 30 తేదీల్లో సెలవులు ఉండనున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ కాగా, అంతకు ముందు రోజు కూడా కలిపి రెండు రోజులు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే.. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 75 శాతానికి పైగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పలు ప్రభుత్వ పాఠశాలలు పోలింగ్ కేంద్రాలుగా ఉండనున్నాయి. ఇక్కడ ముందుగానే పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కూడా ముందు రోజే(నవంబర్ 29) పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
అందువల్లే ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజైన డిసెంబర్ 1న సెలవు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. నవంబర్ 30 సాయంత్రం పోలింగ్ ముగియగా, ఈవీఎంలను ఆయా కేంద్రాలకు తరలించేసరికి రాత్రి అవుతుందని, అందుకే మరుసటి రోజైన డిసెంబర్ 1న ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.