Harish Rao: కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి.. హరీష్ రావు ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Nov 16, 2023, 3:27 AM IST

Thanneeru harish rao: 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనుల ఆధారంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సానుకూల ఓటుతో అధికారాన్ని నిలుపుకుంటుందని పార్టీ సీనియర్ నేత, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హరీశ్ రావు అన్నారు. దక్షిణాదిలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు హ్యాట్రిక్‌ సాధిస్తార‌ని ధీమా వ్య‌క్తంచేశారు.
 


Telangana Assembly Elections 2023: కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)ల‌ను టార్గెట్ చేస్తూ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రతిపక్షాలకు అజెండా అంటూ ఏమీ లేదనీ, అధికార పార్టీ నేతలను పరుష పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఎవ‌రూ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కాలేదనీ, తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ తో చరిత్ర సృష్టిస్తార‌ని ధీమా వ్య‌క్తంచేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్ర సంపద పెరిగిందనీ, అప్పుల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర సంపదను మరింత పెంచి ప్రజలకు పంచుతామన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామ‌ని కూడా చెప్పారు.

కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ హామీ ఇచ్చిన ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు వాస్త‌వం లేద‌ని తిప్పికొట్టారు. కేసీఆర్ చేసిన పని చూసి ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. సీఎం నేతృత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. నగరానికి గ్రీన్ సిటీ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ‌ కేసీఆర్ ను ఓడించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని అన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టిందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.

Latest Videos

కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు 76శాతానికి చేరుకుందన్నారు. వెయ్యికి పైగా గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ బీమా, రైతుబంధు హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ దార్శనికత వల్ల రాష్ట్రంలో కరెంటు కొరత లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 90శాతం అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో చెప్పని మరికొన్ని పనులు కూడా చేశారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆరు లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయ‌ని తెలిపారు. "90 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి మనదే. ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాము. వరి ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ను అధిగమించి నంబర్‌వన్‌గా నిలిచిందని" మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

click me!