ఎన్నికల వేళ ఐటీరైడ్స్ అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణలో వివిధ పార్టీల అభ్యర్థుల ఇళ్లలో ఐటీసోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీదాడులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఇళ్లు, ఆఫీసుల్లో గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా డబ్బు నిలువ చేసినట్లుగా సమాచారం రావడంతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే భాస్కరరావు కుమారుడు, అనుచరుల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 40 బృందాలతో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. భాస్కరరావు అనుచరులకు చెందిన రైస్ మిల్స్ లో ఐటి దాడులు నిర్వహిస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, మహా తేజ రైస్ మిల్లులలో కూడా సోదాలు జరుగుతున్నాయి. భాస్కరరావు పెద్ద కొడుకు చైతన్యకు హైదరాబాదులో ఐటీ సంస్థలు ఉన్నాయి. భాస్కరరావుకు పవర్ ప్లాంట్లలో పెట్టుబడులు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.