తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)కు చెందిన 12 మంది అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదివారం ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)కు చెందిన 12 మంది అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదివారం ఆదేశించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు ఆ పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిందిగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక,ఇతర రాజకీయ పార్టీల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఆర్‌పీఐ తెలంగాణ చీఫ్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ కొద్దిరోజుల క్రితం సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాజాగా వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే, తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై 12 చోట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా మూడు చోట్ల బరిలో ఉన్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) వర్గాలు తెలిపాయి. మిగిలిన స్థానాల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశాయి.
ఇదిలాఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం మరింతగా వెడేక్కింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.