తెలంగాణ పోలీసులపై ఏపిలో దాడి : చెట్టుకు కట్టేసి మరీ చితకబాదిన ప్రజలు

First Published Jun 20, 2018, 2:23 PM IST
Highlights

నిందితురాలిని పట్టుకోడానికి మప్టీలో వెళ్లగా...

ఓ కేసు లో నిందితులను పట్టుకోడానికి వెళ్లిన తెలంగాణ పోలీసులను కర్నూల్ జిల్లా వాసులు దాడికి పాల్పడ్డారు. వారు పోలీసులమని చెబుతున్నా వినకుండా దొంగలుగా భావించి చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. చివరకు స్థానిక పోలీసులు అక్కడికి  చేరుకుని తెలంగాణ పోలీసులను విడిపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.   మహబూబ్ నగర్ జిల్లా బాలా నగర్ పోలీసులు బాలికలను కిడ్నాప్ చేసి అమ్ముకుంటున్న ఓ మహిళ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కిడ్నాపర్ మహిళకు కర్నూల్ జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం రామసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆశ్రయం కల్పించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో బాలానగర్ పోలీసులు కిడ్నాఫర్ కోసం మప్టీలో నిన్న రాత్రి రామసముద్రం గ్రామానికి వెళ్లారు. కిడ్నాపర్ మహిళతో పాటు ఆమెకు ఆశ్రమం ఇచ్చిన వ్యక్తి ఇంట్లో ఉండగా  పట్టుకున్నారు. అయితే వారు కేకలు వేసి గ్రామస్తులను పిలిచారు. దీంతో గ్రామస్తులు మప్టీలోని పోలీసులను దొంగలుగా భావించి దాడికి పాల్పడ్డారు. పోలీసులను ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు.

గ్రామస్తులు ఇవాళ ఉదయం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామానికి చేరుకున్న స్థానిక పోలీసులకు బాలానగర్ పోలీసులు జరిగిన విషయాన్ని తెలిపారు. వీరు నిజంగానే తెలంగాణ పోలీసులని నిర్ధారించుకున్న తర్వాత కిడ్నాపైన బాలికతో పాటు కిడ్నాపర్ మహిళను, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని బాలానగర్ పోలీసులకు అప్పగించారు.     
 

click me!