రాత్రి ఢిల్లీకి రేవంత్ రెడ్డి: రెండు రోజులుగా అక్కడే కోమటిరెడ్డి, ఈ రోజు భట్టి

By telugu teamFirst Published Jun 12, 2021, 2:25 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కాంగ్రెసు పార్టీలో వేడి పుట్టించింది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి క్యూ కట్టారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రిక్రియ చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ పదవిని ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి క్యూ కట్టారు. అయితే, వారికెవరికీ ఇప్పటి వరకు సోనియా గాంధీ, ఇతర అధిష్టానం నాయకుల అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం.

పిసిసి పదవిని ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. తాను పిసిసి పదవిని తప్ప మరో పదవిని తీసుకోనని ఆయన కచ్చితంగా చెప్పారు. ఈ నేపథ్యంలో పీసీసీ పదవి కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. పిసిసి చీఫ్ పదవి దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత వి. హనుమంతరావు వంటివారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మరో వైపు, కాంగ్రెసు శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఈయన కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట రెడ్డి అనుచరులు వేర్వేరుగా తమ నేతకు పిసిసి పదవి ఇవ్వాలంటూ అధిష్టానానికి వినతిపత్రాలు పంపడంతో పాటు తెలంగాణ కాంగ్రెసు ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కు మెసేజ్ లు కూడా పెడుతున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

నాగార్జునసాగర్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కె. జానారెడ్డి చేతులెత్తేశారు. తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోనని చెప్పారు. దీంతో ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో లేనట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

click me!