తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయి, రాసిపెట్టుకోండి: రేవంత్ రెడ్డి

By telugu teamFirst Published Jul 9, 2021, 5:37 PM IST
Highlights

తనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా, వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు.

హైదరాబాద్: తనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పీసీసీ పదవి ఇప్పించారనే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. హరీష్  రావును మంత్రిని చేసింది కాంగ్రెసు పార్టీయే కదా అని ఆయన అన్నారు. హరీష్ రావు బతుకే కాంగ్రెసు అని ఆయన అన్నారు.  

ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెసు హరీష్ రావును మంత్రిని చేసిందని ఆయన అన్నారు. హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. గతి లేక టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ కాళ్లు పట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కు టీడీపీయే దిక్కు అయిందని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లే కదా అని ఆయన అన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినవారు మంత్రులుగా కూడా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసులో చేరే ముందు తాను అన్ని పదవులకూ రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ వల్లనే తనకు పదవి వచ్చింది కాబట్టి తన రాజీనామాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చానని ఆయన అన్నారు. రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.

తాను రాజీనామా చేసిన తర్వాత గన్ మెన్ ను, పీఎలను సరెండర్ చేశానని చెప్పారు. అసెంబ్లీ జీతం ఇచ్చే ఖాతాను కూడా క్లోజ్ చేసినట్లు ఆయన చెప్పారు. తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏమిటని ఆయన అడిగారు. టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడు ఎలానో, అలా తాను కాంగ్రెసుకు అధ్యక్షుడిని అని రేవంత్ రెడ్డి అన్నారు.  

2022 ఆగస్టు 15వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని, కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, తన మాటలను రాసిపెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయబోరని ఆయన అన్నారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ అని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పట్టుకోలేదా అని ఆయన అడిగారు. 

click me!