కంగారొద్దు.. ఇంటికే కరోనా కిట్!

By telugu news teamFirst Published Jul 11, 2020, 12:58 PM IST
Highlights

కరోనా లక్షణాలు బయటపడినా ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడుతున్నారు. దానికి తోడు రోగితో పాటు మరొకరు తోడు వెళ్లాలి. సామాజిక వ్యాప్తి నేపథ్యంలో పేషెంట్, వారి తాలూకు బంధువు ఇద్దరూ భయపడాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సర్కారు ఈ ఉచిత కిట్ నిర్ణయం తీసుకుంది. 

కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఊహించని రీతిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కనీసం బెడ్స్ కూడా ఖాళీగా దొరకడం లేదు. దీంతో.. చాలా మంది కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఇంట్లోనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నారు. మరి అలాంటి వారికి చికిత్స ఎలా అనే సందేహం కలిగే ఉంటుంది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ఇంటి వద్ద ఉన్న కరోనా రోగులకు మరింత వెసులు బాటు కలిగించేందుకు వీలుగా తెలంగాణ సర్కారు కరోనా కిట్ లను ఉచితంగా అందజేయనుంది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్ లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆస్పత్రులలో ఎంత మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారో దాదాపు అదే స్థాయిలో ఇంటి వద్ద ఉండి చికిత్స పొందుతున్నా వారు ఉన్నారు. కరోనా లక్షణాలు బయటపడినా ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడుతున్నారు. దానికి తోడు రోగితో పాటు మరొకరు తోడు వెళ్లాలి. సామాజిక వ్యాప్తి నేపథ్యంలో పేషెంట్, వారి తాలూకు బంధువు ఇద్దరూ భయపడాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సర్కారు ఈ ఉచిత కిట్ నిర్ణయం తీసుకుంది. 17 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉన్న వారి కోసం ఈ కిట్ అందించనుంది.

బాధితుడు ఇంటి నుండే చికిత్స పొందుతున్నాడనే సమాచారం వైద్యులు నిర్ధారించుకోగానే వారికి సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా వైద్య సిబ్బంది బాధితుని ఇంటికెళ్లి అందజేస్తుంది. ఒకే ఇంట్లో ఒకరికి మించి కరోనా రోగులు ఉన్నా అందరికీ ఉచితంగా అందిస్తుంది. వైద్య సిబ్బంది తరచుగా వారికి ఫోన్ వారి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఇక కిట్ లో అందించే వస్తువులు.. శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమల్, యాంటీ బయాటిక్స్, లివోసెటిరిజైన్, విటమిన్ సి,ఇ,డి3, ఎసిడిటీని తగ్గించే ఔషధాలు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు అని అవగాహన పెంపొందించే పుస్తకాలు ఉంటాయి. 

click me!