కాంగ్రెస్‌కు కరెంట్ షాక్.. అందుకే విలవిల..హస్తం పార్టీ కుట్రను రైతాంగం తిప్పికొడుతుంది: రాష్ట్రమంత్రులు నిరంజన

By Mahesh K  |  First Published Jul 15, 2023, 4:35 PM IST

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే తెలంగాణ రైతాంగం ముందు ఉచిత కరెంట్ గురించి మాట్లాడే హక్కును కలిగి ఉంటుందని అన్నారు. రైతాంగం కాంగ్రెస్ పార్టీ కుటిలాన్ని తిప్పికొడతారని పేర్కొన్నారు.
 


హైదరాబాద్: అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని హస్తం పార్టీపై పంజా విసురుతున్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలను తూర్పారబడుతున్నారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయంగా ఒక విధానం, రాష్ట్రాలకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందా? అంటూ వ్యంగ్యం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం ముందుకు వచ్చే కనీస హక్కు ఆ పార్టీకి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ రైతాంగం తిప్పికొడుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా ఎదుటి వారిపై దాడికి దిగడం శోచనీయం అని అన్నారు. అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ విధానాలలో లోపాలుంటే విమర్శించాలని తెలిపారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నదని, కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రూ. 72 వేల కోట్ల నిధులు రైతు బంధు కింద అందించిందని చెప్పారు. గతంలో కరెంటు లేక, రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగిన దుస్థితి ఉండేదని, కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని వివరించారు.

Latest Videos

అధికారయావ తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, దానికి ఉదాహరణ ఆ పార్టీ పాలనే అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో హస్తం పార్టీది విద్రోహమే అని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలే ఏం చేయాలన్నా ఢిల్లీలో స్విచ్ నొక్కాల్సి ఉంటుందని, అదే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ తెలంగాణ రాష్ట్రమే అని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా కాదని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత జానారెడ్డి అన్నారని, అది సాధ్యమైతే తాను బీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తానని చెప్పి ఇప్పుడు మిన్నకున్నారని ఫైర ్అయ్యారు. కరెంట్ కొనుగోలు ఆన్‌లైన్ టెండర్ల ద్వారా జరుగుతుందని, అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి ఒక్కో రైతు మూడు గంటలు, ఎనిమిది గంటలు, ఐదు గంటలు వాడుతుండొచ్చని, కానీ, వారికి అవసరమైనప్పుడు కరెంట్ ఉండాలి కదా అని వివరించారు. అన్నం ఉడికినప్పుడే ఎప్పుడైనా తినే వీలు ఉంటుందని తెలిపారు.

Also Read: MLC Kavitha: అసెంబ్లీ ఎన్నికల బరిలో కల్వకుంట్ల కవిత?

మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ విషయంపై చర్చ ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? వ్యాపారాలకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఉండొచ్చు గానీ, రైతులకు ఉండగానే వీరికి జీర్ణం కావడం లేదా? అని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. తొందరపాటుతో చంద్రబాబును బయటేసిన రేవంత్ ఇవాళ ఉచిత్ కరెంట్ పై కాంగ్రెస్ అంతరంగాన్ని బయటపెట్టాడని ఆరోపించారు. కరెంట్ 24 గంటలు అందుబాటులో లేనప్పుడు రైతులు తెల్లవార్లు, రాత్రిళ్లు కరెంట్ పెట్టడానికి పోయేవారని, ఆ క్రమంలో పాముకాటు, ఇతర అనేక ప్రమాదాలకు వారు గురయ్యేవారని వివరించారు. జాతీయ కాంగ్రెస్‌కు దమ్ముంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ పని చేసినప్పుడే తెలంగాణ రైతాంగం ముందుకు 24 గంటల ఉచిత కరెంట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు సంక్రమిస్తుందని అన్నారు. ఛత్తీస్‌గడ్‌లో మిగులు కరెంట్ ఉన్నా..ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తుందిగానీ 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం అందించడం లేదని విమర్శించారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలను అద్దంకి దయాకర్, పార్టీ అధికార ప్రతినిధి సుజా చెప్పడం కాంగ్రెస్ విధానాలకు నిదర్శనం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన వల్ల 12 లక్షల వ్యవవసాయ మోటార్ కనెక్షన్లు కొత్తగా ఏర్పడ్డాయని, సాగులో తెలంగాణ ముందుకు వచ్చిందని వివరించారు. వ్యవసాయం రంగం ద్వారా తెలంగాణ జీడీపీ పెంచుకుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి. తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు

click me!