కృష్ణా బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యం చేస్తే సహించేది లేదని ఆయన ఏపీ సీఎం జగన్ ను హెచ్చరించారు.
హైదరాబాద్: కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎపీ ప్రభుత్వం చేస్తున్న నీళ్ల దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజోలుబండ వద్ద తూములు పగులగొట్టి నీళ్లు దోచుకుపోయారని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్ 80 వేల క్యూసెక్కుల నీరు తీసుకుపోతున్నారని ఆయన అన్నారు. పాలమూరు ప్రజలకు నీళ్లు వద్దా, వాళ్లు బతుకొద్దా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు.
undefined
కేంద్రం అనుమతి లేకుండా రాయలసీమ ప్రాజెక్టు పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వైఖరి నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కృష్ణా బేసిన్ లో ఉందా, పెన్నా బేసిన్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లాకు నీరు తీసుకుని వెళ్తామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎలా చెబుతారని శ్రీనివాస్ గౌడ్ అడిగారు. తెలంగాణ ఎగువన ఉందని, ఏపీలో ఒక్కడి కడితే ఇక్కడ పది ప్రాజెక్టులు కడుతామని ఆయన అన్నారు. పై నుంచి నీళ్లను మలుపుకోవడం తమకు తెలియదా అని ఆయన అడిగారు. దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.