
హైదరాబాద్: ఈ ఏడాది ఆగష్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం నాడు ప్రకటించింది. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది.
వాస్తవానికి ఈ ఏడాది జూలై 5 నుండి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కేసుల ఉధృతి కారణంగా ఎంసెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 3వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణకు తొలుత గడువు ఇచ్చారు. ఆ గడువును తర్వాత పెంచారు.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మళ్లీ కాంపిటిటీవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొంది. ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆగష్టు 11 నుండి 14 వరకు పీజీఈ సెట్, ఆగష్టు 19, 20 తేదీల్లో ఐ సెట్, ఆగస్టు 23న లా సెట్ నిర్వహించనున్నారు.