గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల పున: ప్రారంభానికి సర్వం సిద్ధం.. మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష

By telugu teamFirst Published Oct 21, 2021, 6:00 PM IST
Highlights

గురుకులాలు, హాస్టళ్లు పున:ప్రారంభించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంపై కసరత్తులు చేస్తున్నది. ప్రతి విద్యార్థిని పాఠశాలలకు రప్పించే బాధ్యత ఆ ఉపాధ్యాయులదేనని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
 

హైదరాబాద్: కరోనాతో పాఠశాలలు, హాస్టళ్లు మూతపడటంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగింది. కొవిడ్-19 నేపథ్యంలో ఇటీవలే హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గురుకులాలు, హాస్టళ్లు పున:ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలోనే రాష్ట్రప్రభుత్వం గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలలు రీఓపెన్ చేయడానికి కసరత్తులు చేస్తున్నది. వీటిని పున:ప్రారంభించడానికి సర్వం సిద్ధం అయ్యాయి. ఇలంటి సందర్భంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలలను పున:ప్రారంభించడాన్ని సమీక్షించారు.

కరోనాతో పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులుకలిగాయని, తిరిగి గురుకులాల్లో వారు చేరడానికి డిమాండ్ ఉన్నదని మంత్రి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు అవసరమైతే కౌన్సిలింగ్ ఇచ్చి మరీ విద్యార్థులను పాఠశాలల్లో చేర్చే బాధ్యత ఉపాధ్యాయులదేనని వివరించారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడాలకు వెళ్లి ప్రతి ఇంటిలోని విద్యార్థులను నమోదు చేయాలని సూచించారు. ఏ ఒక్కరూ పాఠశాలల్లో చేరకుండా ఉండటానికి వీల్లేదని తెలిపారు. 

Also Read: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లుప్రైవేట్ కాలేజీలపై సీరియస్: సబితా ఇంద్రారెడ్డి

ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్ కోసం పనిచేయాలని, అవసరమైతే గ్రామాల్లోని అంగన్వాడీ ఉద్యోగుల సేవలనూ వినియోగించుకుని ప్రతివిద్యార్థిని పాఠశాలలకు వచ్చేలా చేయాలని సూచించారు. 

కరోనా కారణంగా మూతపడ్డ విద్యా సంస్థల్లో గతనెల రోజులుగా పారిశుధ్య పనులు జరుగుతున్నాయని, ఇంకా ఏమైనా ఇబ్బందులున్నా వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి వసతులు కల్పించి అన్ని మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. వీటికోసం ఇప్పటికే స్కూల్ హెడ్ మాస్టర్లు, హాస్టల్ వార్డెన్లకు రూ. 20వేలు ఇచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం 24 గంటలు నడిచే హెల్త్ కమాండ్ సెంటర్ నిర్వహించాలని, కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, ఇథర అధికారులు పాల్గొన్నారు.

click me!