సోనియానే బెదిరించి.. వైఎస్ వల్లే తెలంగాణ ఆలస్యం : మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 29, 2022, 8:14 PM IST
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే తెలంగాణ ఆలస్యమైందని, సోనియానే ఏకంగా ఆయన బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు.

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్‌పై టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ని వీడుతానని సోనియాను వైఎస్ బ్లాక్‌మెయిల్ చేశారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కారణం చేతే సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గారని ఆయన గుర్తుచేశారు. వైఎస్ వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్ధులు అమరులయ్యారని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వందలాది మంది బిడ్డలను పొట్టనబెట్టుకుందని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుతో నాడు కేంద్ర మంత్రిగా వున్న కేసీఆర్ తన పదవిని వదిలేయడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. 

ఇకపోతే.. గతంలోనూ జగన్ ప్రభుత్వంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు కావాలని.. కేంద్రం ఒత్తిడితో ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని మంత్రి చెప్పారు. దేశంలోని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసంపై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

ALso Read:జగన్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ  నియోజకవర్గంలోని  లింగగిరిలో  వైఎస్ షర్మిలకు చెందిన  బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు  షర్మిల  పార్టీకి  చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో  నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో  వైఎస్  షర్మిలను పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్‌లో వదిలి వెళ్లిపోయారు.  

అయితే నర్సంపేటలో టీఆర్ఎస్  శ్రేణుల దాడికి నిరసనగా  ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని  వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది.    పోలీసుల కళ్లుగప్పి  షర్మిల  లోటస్  పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన  కారుతో  ప్రగతి భవన్ వైపునకు వెళ్లే  ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో  షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా  ఆమె  నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత  కూడా  ఆమె  కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్  చేసి  షర్మిలను  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా  వచ్చిన  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

click me!