షర్మిల ఏం నేరం చేసింది.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా : కేసీఆర్ ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ ఫైర్

By Siva KodatiFirst Published Nov 29, 2022, 7:44 PM IST
Highlights

తన భార్య వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌పై మండిపడ్డారు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మండిపడ్డారు. తన భార్య అరెస్ట్‌‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుందన్నారు. షర్మిల ఏం నేరం చేసిందని అరెస్ట్ చేశారని బ్రదర్ అనిల్ కుమార్ ప్రశ్నించారు. 

అంతకుముందు మధ్యాహ్నం ఆయన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. లోపలికి వెళ్లనివ్వకపోవడానికి తానేమీ క్రిమినల్‌ను కాదన్నారు. ప్రభుత్వ లోపాలు మాత్రమే ఎత్తి చూపామని, ఇందులో వ్యక్తిగత అజెండా ఏముందని బ్రదర్ అనిల్ కుమార్ ప్రశ్నించారు. 

మరోవైపు.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌పై పోలీసులు ప్రకటన చేశారు. పంజాగుట్టలో నమోదైన కేసులో షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు షర్మిల అరెస్ట్‌పై వివరాలు తెలిపారు. సోమాజిగూడలో మంగళవారం చోటు చేసుకున్న వివిధ ఘటనలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 9 సెకన్ల కింద షర్మిలతో పాటు ఐదుగురిపై 143, 341, 290, 506, 509, 336, 353, 382, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్ట్ వద్దకు తరలించారు. ఈ సందర్భంగా షర్మిలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

ALso REad:వైఎస్ షర్మిల అరెస్ట్ అందుకే.. పోలీసుల అధికారిక ప్రకటన, బ్రదర్ అనిల్‌కి సమాచారం

కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ  నియోజకవర్గంలోని  లింగగిరిలో  వైఎస్ షర్మిలకు చెందిన  బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు  షర్మిల  పార్టీకి  చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో  నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో  వైఎస్  షర్మిలను పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్‌లో వదిలి వెళ్లిపోయారు.  

అయితే నర్సంపేటలో టీఆర్ఎస్  శ్రేణుల దాడికి నిరసనగా  ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని  వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది.    పోలీసుల కళ్లుగప్పి  షర్మిల  లోటస్  పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన  కారుతో  ప్రగతి భవన్ వైపునకు వెళ్లే  ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో  షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా  ఆమె  నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత  కూడా  ఆమె  కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్  చేసి  షర్మిలను  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా  వచ్చిన  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


 

click me!