తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్... నిన్న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు, అంతలోనే

By Siva KodatiFirst Published Jan 27, 2022, 4:40 PM IST
Highlights

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (niranjan reddy) కూడా కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. తనకు కరోనా సోకడంపై నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

దేశంలో కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు పాజిటివ్‌గా తేలింది. వీరిలో కొందరు కోలుకోగా.. మరికొందరు క్వారంటైన్‌లో వుంటున్నారు. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (niranjan reddy) కూడా కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. తనకు కరోనా సోకడంపై నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, నిరంజన్ రెడ్డి ఇవాళ కూడా తన నివాసం నుంచి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి నాబార్డు రాష్ట్ర దృష్టి పత్రాన్ని విడుదల చేశారు.

కాగా... ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చిన ఎంపీ కొవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. 

తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా..  దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

దేశంలో నిన్న(జనవరి 26) 14,62,261 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 72,21,66,248 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 22,35,267 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,63,84,39,207కి చేరింది. 

click me!