హైద్రాబాద్ నగరంలో హెచ్ఎండీఏ భూముల విక్రయంలో రికార్డు ధర పలకడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయం చూసైనా విపక్షాలు కళ్లు తెరవాలన్నారు.
హైదరాబాద్:నగరంలోని కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికిదంటే హైద్రాబాద్ అభివృద్ధిని అర్ధం చేసుకువచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.నగరంలోని కోకాపేటలో హెచ్ఎండీఏ ప్లాట్ల విక్రయాన్ని నిన్న చేపట్టింది. ఈ భూములకు రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజైన శుక్రవారం నాడు ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సమయంలో ఐటీ, ఉపాధి అంశాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.హెచ్ఎండీఏలో భూముల విక్రయం చేస్తే వందల కోట్లకు కొనుగోలు చేసేందుకు సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ధర్నాలు చేస్తే, డైలాగులు చెబితేనే ఇంత ధరలు పలకవని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏదో జరిగితే వందల కోట్లతో భూములు కొనుగోలు చేసేందుకు సంస్థలు ఎందుకు వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు.రాష్ట్రాన్ని సాధించిన నేత సీఎంగా ఉండడం తెలంగాణకు శ్రీరామరక్షగా కేటీఆర్ పేర్కొన్నారు. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్ షిప్ వల్లే ఇదంతా జరిగిందన్నారు.
గత ఏడాది కంటే ఐటీ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మరింత వృద్ధిని సాధించిందన్నారు.ఈ విషయాన్ని నాస్కామ్ గణాంకాలు చెబుతున్నాయన్నారు.ఐటీ రంగంలో ఉపాధిలో భారత్ లో 44 శాతం తెలంగాణ నుండి వచ్చినవేనన్నారు. గత ఏడాది 33 శాతం తెలంగాణ నుండి ఐటీ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఐటీలో బెంగుళూరును వెనక్కి నెట్టి తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని కేటీఆర్ ప్రకటించారు. గురుగ్రామ్ లో ఐటీ పరిశ్రమను నాశనం చేశారని ఆయన అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
also read:మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ: బీఏసీలో నిర్ణయం, బీజేపీకి రాని ఆహ్వానం
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో హైద్రాబాద్ గురించి ఎంత గొప్పగా చెప్పాడో విపక్షాలు గుర్తించాలన్నారు. అయినా ఇంకా కొంతమంది ఇంకా కళ్లు తెరవలేదని విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఐటీని జిల్లాలకు కూడ విస్తరించినట్టుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు కల్పించినట్టుగా మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.