
పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (hardeep singh puri) ట్వీట్లపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) స్పందించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్ ఉత్పత్తులపై పన్ను పెంచలేదన్నారు. 2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు వున్నప్పుడు పెట్రోల్ రూ.75 అని.. ఇప్పుడు కూడా అదే ధరకు క్రూడాయిల్ దొరుకుతున్నప్పుడు రూ.120కి పైగా పెట్రోల్ ధర పెంపుపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందుకు మీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు , సెస్‌లు కారణం కాదా అని మంత్రి ప్రశ్నించారు. మరి మీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.26 లక్షల కోట్లు సెస్‌ల రూపంలో లాక్కొన్నది వాస్తవం కాదా అని నిలదీశారు కేటీఆర్.
ఇకపోతే.. నిన్న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలోనూ ఇదే విషయంగా సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లేని సెస్సులు ఎందుకు పెంచుతుంది.. మేం పెట్రోల్ ధరలు ఎప్పుడు పెంచామని ఆయన ప్రశ్నించారు. కరోనాపై మీటింగ్ పెట్టి రాష్ట్రాలు ట్యాక్స్‌లు (tax) తగ్గించాలని మోడీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇదేం పద్ధతి.. ప్రధాని మాట్లాడే మాటలేనా అని కేసీఆర్ ఫైరయ్యారు. ప్రధాని మోడీ (narendra modi) డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారంటూ దుయ్యబట్టారు. ఏ నోటితో రాష్ట్రాలను తగ్గించాలని అడుగుతారని ఆయన ఫైరయ్యారు. మీరెందుకు పెట్రోల్ , డీజిల్‌పై సెస్ పెంచారని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ పెంచలేదని సీఎం పేర్కొన్నారు.
ఆర్టీసీని (tsrtc) అమ్మాలని ప్రధాని మోడీ ఆఫర్ పెట్టారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్ర పెద్దలేనని.. ఆర్టీసీని అమ్మే రాష్ట్రాలు వెయ్యి కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారంట అంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. పొద్దున లేస్తే మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. మనిషి కోసం మతమా..? మతం కోసం మనిషా అని కేసీఆర్ ప్రశ్నించారు. మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి మతాన్ని వాడతారా అని సీఎం నిలదీశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. ఊరేగింపుల్లో కత్తులు, కటార్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నారని సీఎం మండిపడ్డారు.
ఎనిమిదేళ్లలో మోడీ ఏం అభివృద్ధి చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ రంగంలో అభివృద్ధి జరిగిందన్న దానిపై ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. పన్నులు పెంచేది మీరు.. రాష్ట్రాలు తగ్గించాలా..? ఇదెక్కడి నీతి అని కేసీఆర్ నిలదీశారు. మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. చాలా భయంకరమైన పరిస్ధితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గారూ ఇక మీ ఆటలు సాగవని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యమం ఇంకా చచ్చిపోలేదని.. రాష్ట్రం పక్షాన దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని సీఎం తెలిపారు.