తెలంగాణ గవర్నర్ తీరుపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.
నల్లగొండ :తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకునేలా గవర్నర్ చర్యలున్నాయని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.శుక్రవారంనాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఉద్దేశ్యంతోటే తెలంగాణా బిల్లులపై గవర్నర్ సంతకాలు పెట్టలేదన్నారు.పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుందని ఆయన చెప్పారు. రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు.గవర్నర్ కు ఎవరూ బానిసలు లేరని ఆయన తెలిపారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కు గవర్నర్ వద్ద పైరవీలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హోలి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తర్వాత విచారించే అవకాశం ఉంది.
also read:రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు: తమిళిసైపై రేవంత్ రెడ్డి
పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై గవర్నర్ తమిళిసై సీరియస్ గా స్పందించారు. రాజ్ భవన్ ఢిల్లీ కంటే చాలా దగ్గర అని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె చెప్పారు. కానీ చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడం లేదని సీఎస్ వ్యవహరాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తప్పుబట్టారు.