దేశంలో మా డబ్బులూ వున్నాయి.. కేసీఆర్ ఫోటో పెడతారా : నిర్మలమ్మపై హరీశ్ ఫైర్, క్షమాపణలకు డిమాండ్

By Siva KodatiFirst Published Sep 2, 2022, 2:54 PM IST
Highlights

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీశ్ రావు. అబద్ధాల మంత్రుల లిస్టులో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారని హరీశ్ రావు చురకలంటించారు. 

తెలంగాణ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారని.. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని హరీశ్ ఫైరయ్యారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని.. తెలంగాణ నిధులే కేంద్రానికి వెళ్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. 

కేంద్రంలో ముందుగా మా కేసీఆర్ ఫోటో పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. నోరు విప్పితే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని.. అబద్ధాలు చెప్పి నిజాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు చురకలు వేశారు. పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఏటా రూ.3,610 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రానికి రూ.1.7 లక్షల కోట్లు అదనంగా ఇచ్చామని.. మీరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని , మేం వాస్తవాలు మాట్లాడుతున్నామని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారలేదని అమిత్ షా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

Also read:కామారెడ్డిలో నిర్మలమ్మకు నిరసన సెగ.. కలెక్టర్‌ను నిలదీసిన కేంద్రమంత్రి.. మోడీ ఫొటో ఏదంటూ ఫైర్

మూడు నెలల్లో హెల్త్ సిటీ పనులు 15 శాతం పూర్తి చేశామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని.. పది పైసలు ఇస్తారని, రూపాయి ప్రచారం చేసుకుంటారని ఆయన చురకలు వేశారు. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం తెలంగాణలో వుందని హరీశ్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద 90 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందని.. ఆయుష్మాన్ భారత్ బీపీఎల్ ఫ్యామిలీలకే ఇస్తారని ఆయన గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ బేషరతుగా క్షమాపణలు చెప్పి గౌరవం నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఆయుష్మాన్ భారత్ విషయంలో తెలంగాణపై అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. మేం ఇప్పటికే చేరి వుంటే మీరు రాజీనామా చేస్తారా అని హరీశ్ రావు సవాల్ విసిరారు. 2021లోనే ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ ప్రభుత్వం చేరిందని మంత్రి గుర్తుచేశారు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్రం కూడా ప్రకటించిందని.. అబద్ధాల మంత్రుల లిస్టులో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారని హరీశ్ రావు చురకలంటించారు. అమిత్ షా, గడ్కరీ ఇలా అందరూ అబద్ధాలే చెబుతున్నారని.. కేంద్రం పనితీరుతో దేశం మొత్తం దివాళా తీసే పరిస్ధితి వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్ ధర భారీగా పెంచామని నిర్మలా సీతారామన్ గల్లీలకు వెళ్లి చెప్పుకోవాలని హరీశ్ అన్నారు. 
 

click me!