తలొగ్గేది లేదు, ఎన్ని విచారణలకైనా రెడీ, కేసీఆర్ చేయాల్సిందే: ఈటెల

By Siva KodatiFirst Published Apr 30, 2021, 9:41 PM IST
Highlights

తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎన్ని విచారణలకైనా సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులే స్వచ్ఛందంగా భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారని మంత్రి తెలిపారు.

తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎన్ని విచారణలకైనా సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులే స్వచ్ఛందంగా భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారని మంత్రి తెలిపారు. భూములు కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను అమ్ముకోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా తన సాయం వుంటుందని వెల్లడించారు.

నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎస్, విజిలెన్స్ విచారణలతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాల్సిందేనని రాజేందర్ కోరారు. నా ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదని ఆయన తేల్చిచెప్పారు. నాపై ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజేందర్ సవాల్ విసిరారు. ధర్మం తప్పకుండా పనిచేస్తున్నానని.. తాత్కాలికంగా న్యాయం ఓడిపోవచ్చని కానీ అంతిమ విజయం ధర్మానిదేనన్నారు.

ఇది రాజకీయ కక్ష సాధింపేమో తెలియడం లేదని.. ప్రజల కోసం కొట్లాడతా తప్పించి లొంగిపోనని రాజేందర్ తేల్చి చెప్పారు. వందకోట్ల రుణాలు తీసుకునేంత పరపతి నాకు వుందని.. చిల్లరమల్లర మాటలకు ఈటల బెదిరిపోడన్నారు. పదిమందికి సాయం చేసే మనస్తత్వం నాదని... నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేశానని మంత్రి తెలిపారు. 2004కు ముందే నాకు 100 ఎకరాల భూమి వుందని ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో‌ పేర్కొన్నట్లు ఈటల తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చి భూములు అమ్మానని... కొందరు ఒక్క జనరేషన్‌లో వందల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. మా కోళ్ల ఫారాలతో న్యాయంగా సంపాదించానని.. 2004 వరకు రాష్ట్రంలో నా కోళ్ల ఫారం పది లక్షల టర్నోవర్‌కు చేరిందన్నారు. ఈటల చరిత్ర 20 ఏళ్లుగా అందరికీ తెలుసునని.. నలిపిస్తే నలిగేది కాదని, చెరిపితే చెరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు.

Also Read:పథకం ప్రకారం దుష్ప్రచారం... ఒక్క ఎకరం నా స్వాధీనంలో లేదు: కబ్జా ఆరోపణలపై ఈటల స్పందన

భూములకు సంబంధించిన పరిష్కారంపై నరసింగరావును అడిగానని .. రాయితీ కూడా వద్దని సీఎంవోలోనే చెప్పానని రాజేందర్ పేర్కొన్నారు. తాను శ్రమను నమ్ముకున్నానని.. ఆనాడే వైఎస్‌కు చెప్పానని వెల్లడించారు. 2004 నుంచి 2014 వరకు ఉద్యమకారులను  కాపాడుకున్నానని.. తనకు కుల, మతాలు లేవన్నారు. తన జాతి భయపడే జాతి కాదని.. తాను ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు.

దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర తనదని... స్కూటర్లపై వచ్చిన వారికి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. వేల కోట్లకు ఎదిగిన వాళ్లున్నారని, వారికి ఆ ఆస్తులు ఎలా వచ్చాయని ఈటల నిలదీశారు. తప్పు చేశానని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని రాజేందర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం నుంచి తాను ఒక్క రూపాయి రాయితీ తీసుకోలేదని..  ఒక్క రూపాయి తీసుకున్నానని తేలితే ముక్కు నేలకు రాస్తానని ఈటల స్పష్టం చేశారు.

నా ఆత్మగౌరవంపై దెబ్బ పడితే సహించనని.. అందరి చరిత్రలు తనకు తెలుసునని రాజేందర్ పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి విచారణ జరపాలని ఈటల డిమాండ్ చేశారు. నయిం లాంటి వాడు బెదిరిస్తేనే తాను బెదరలేదని.. నాకు ఈ ఆస్తులు ఎంతని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని అసైన్డ్ భూములపై విచారణ జరపాలని ఈటల డిమాండ్ చేశారు. అచ్చంపల్లిలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని రాజేందర్ పేర్కొన్నారు. తీసుకున్న రుణానికి సంబంధించి ఇంకా బ్యాంక్ లోన్ కడుతూనే వున్నామని ఈటల పేర్కొన్నారు.

click me!