తెలంగాణలో కొత్తరకం వైరస్ కేసులు బయటపడితే... వైద్యం ఎలాగంటే: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

By Arun Kumar PFirst Published Dec 22, 2020, 4:48 PM IST
Highlights

కొత్త వైరస్ లు వచ్చినప్పుడు మ్యుటేషన్ లు జరగడం సర్వ సాధారణం అని...కరోనా విషయంలో ఇప్పుడు అదే జరుగుతోందని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ లో ఇప్పటి వరకు కొత్త కరోనా వెరియెంట్ సోకిన వారెవరూ లేరని... అలా ఎవరైనా వుంటే వారిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తామని  తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త వైరస్ లు వచ్చినప్పుడు మ్యుటేషన్ లు జరగడం సాధారణం అన్నారు.

''ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉండడం మంచిది. అలాగే న్యూ ఇయర్ ను కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లోనే జరుపుకోండి.  బయట వేడుకల్లో పాల్గొనవద్దు. కొత్త వైరస్ సోకిన ఆందోళన అవసరం లేదు...ఇంతకు ముందు లాగే వారికి చికిత్స అందిస్తాం'' అని రమేష్ రెడ్డి వెల్లడించారు. 

యూకేలో కొత్తరకం వైరస్ ప్రస్తుతం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కూడా మీడియాతో మాట్లాడారు. రాబోయే 14 రోజులు విదేశాల నుంచి వచ్చే వారిని ట్రాక్ చేసేందుకు గాను హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 040-24651119 నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

గత కొన్ని రోజులుగా యూకే నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే.. వారు ఆ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో వున్న వారి దగ్గరకు ప్రభుత్వ హెల్త్ వర్కర్లు వస్తారని.. అవసరమైన వారికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

నిన్న రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏడుగురికి కోవిడ్ 19 టెస్ట్ చేశామని, వారికి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్నారు. అలాగే గత వారం రోజులుగా తెలంగాణకు వచ్చిన వారిని గుర్తించి, వారికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తామన్నారు.

కొత్త రకం వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. సార్స్ కోవ్ 2లో కూడా కొన్ని వందల మ్యూటేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే బ్రిటన్‌లో వెలుగు చూసిన వైరస్ మిగిలిన వాటి కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త వైరస్ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ నుంచి ఎవరూ ఇంకా పాజిటివ్‌గా తేలలేదన్నారు. యూకే నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు 355 మంది వచ్చినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే వుందని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో 65,20,993 పరీక్షలు నిర్వహించామని.. దానిలో ఈరోజు వరకు పాజిటివ్ రేట్ 1.19 శాతంగా వుందన్నారు. ప్రతిరోజూ 400 నుంచి 500 కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. 


 

click me!