Telangana MLC Elections: తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

By team teluguFirst Published Nov 16, 2021, 1:39 PM IST
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) మంగళవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ (Polling) నిర్వహించనున్నారు.

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) మంగళవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ (Polling) నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే ఈ 12 స్థానాలు ప్రస్తుతం టీఆర్‌ఎస్ (TRS) చేతుల్లో ఉన్నవే. అయితే ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు ఉంటుంది.

ఇక, ఈ ఎన్నికలకు సంబందించి.. నవంబర్ 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగుతుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 26న ఉపసంహరణకు అఖరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 

స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్నా పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరిలో ముగియనుంది. 

ఈసీ షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ప్రస్తుతం ఉన్నవారు కొందరు మరోసారి అవకాశం కూడా వారివంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు కేసీఆర్ కూడా.. పార్టీ అభ్యర్థుల విషయంలో అన్ని విషయాలను పరిగణలోని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, రాజకీయ నైపుణ్యం, పార్టీ పట్ల విధేయతను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులలో 90 శాతం మంతి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.  ఈ అంచనాల ప్రకారం.. TRS పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మరి మిగతా పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతాయా..?, ఇండిపెండెంట్‌గా ఎవరైనా బరిలో నిలవనున్నారా..? అనేది వేచి చూడాల్సి ఉంది. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్.. 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ( MLC election) సంబంధించి టీఆర్‌ఎస్ (TRS) అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి,  కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెకర్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్ (banda prakash) పేర్లను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వీరు అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు.  ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న బండ ప్రకాష్‌ను (banda prakash) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం వెనకాల సీఎం కేసీఆర్ (CM KCR) భారీ కసరత్తే జరిపినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేడే అఖరి తేదీ కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవం అయినట్టే.

click me!