ఇక.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దిపై కేసీఆర్ ఫోకస్.. సీఎం లెక్కలు ఇవేనా..?

Published : Mar 30, 2022, 11:41 AM IST
ఇక.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దిపై కేసీఆర్ ఫోకస్.. సీఎం లెక్కలు ఇవేనా..?

సారాంశం

యాదాద్రి ఆలయం పునర్మిణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా అద్భుత‌మైన దివ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్దిపై దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తోంది. 

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునర్మిణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా అద్భుత‌మైన దివ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. తెలంగాణ స‌ర్కారు అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని యాదాద్రి పంచ నార‌సింహ కేత్రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా పున‌ర్నిర్మించింది. దీని వెనక ఆరున్నరేళ్ల శ్రమ ఉంది. సోమవారం మహాకుంభ సంప్రోక్షణతో ఆలయం పున:ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు న‌ర‌సింహ‌స్వామి నిజ‌స్వ‌రూప ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు.

అయితే ఇన్నేళ్లు వైష్ణవానికి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌ ఇక నుంచి శైవం వైపు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. శైవానికి ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైష్ణవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అపవాదును తొలగించుకోవడానికే కేసీఆర్ శైవాలయాలపై దృష్టి పెడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన రోజే దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయాలనే తన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ సన్నిహితులకు తెలియజేసినట్టుగా టీఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ పేర్కొంది. 

వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో.. వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టును కూడా మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా సమాచారం. 

వేములవాడ అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం త్వరలోనే కేసీఆర్‌ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వద్దకు వెళుతున్నారనే ప్రచారం సాగుతుంది. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆగమ సంబంధమైన సమస్యలు, ఆలయ సంబంధమైన ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణ బాధ్యత మొత్తాన్నీ శృంగేరీ జగద్గురువులకే అప్పగిస్తారనీ, పండితులు, శిల్పులంతా వారు సూచించిన మేరకే వస్తారనీ కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టుగా నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది. 

వేములవాడ పునర్నిర్మాణ బాధ్యతలు సీఎల్‌ రాజంకు..!
వేములవాడ పునర్నిర్మాణ బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్ రాజంకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎల్ రాజం కేసీఆర్‌కు సన్నిహితునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీగా కొనసాగారు. సీఎం రాజంను కేసీఆర్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. రాజం బీజేపీలో చేరారు. దీంతో కేసీఆర్‌కు, రాజంకు మధ్య దూరంగా పెరిగిందనే వార్తలు వచ్చాయి. సీఎల్ రాజం మరో పత్రికను నడుపుతున్నారు. 

అయితే తాజాగా యాదాద్రి పున:ప్రారంభం సందర్భంగా సీఎల్ రాజం కేసీఆర్‌తో పాటు కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య దూరం తగ్గిందనే ప్రచారం మొదలైంది. ఇక, వేములవాడ ఆలయం పునర్నిర్మాణ బాధ్యతను సీఎం రాజంకు అప్పగించడమే సముచితమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని నమస్తే తెలంగాణ పేర్కొంది. టీఆర్‌ఎస్ సొంత పత్రికలో ఈ విధమైన కథనం రావడంతో.. కేసీఆర్‌తో రాజంకు మధ్య విభేదాలు తొలగిపోయాయనే చర్చ సాగుతుంది. 

యాదాద్రి ఆలయాన్ని అభివృద్ది చేయడం ద్వారా కేసీర్ వైష్ణవంపైనే దృష్టి పెట్టారనే ప్రచారం కూడా సాగింది. అయితే వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయడం ద్వారా..  వైష్ణవంతో పాటు శైవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించాలన్నది కేసీఆర్‌ ఉద్దేశంగా తెలుస్తోంది.  శైవం, వైష్ణవమనే తేడాల కన్నా ఆయన దైవాన్ని ఎక్కువగా నమ్ముతారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా కల్పించాలని కేసీఆర్ భావనగా ప్రచారం సాగుతుంది.

2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఆ తర్వాత ఏడాదికి వేములవాడ అభివృద్దికి హామీ ఇచ్చారు.  2015 జూన్ 18న కుటుంబంతో సహా వేములవాడ ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్.. రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయ అభివృద్దికి ఏటా రూ.వంద కోట్లు చొప్పున నాలుగేండ్లళ్లలో రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గుడిచెరువు చుట్టూ150 ఫీట్ల వెడల్పుతో 3.5 కి.మీ. మేర ట్యాంక్ బండ్ నిర్మిస్తామని ప్రకటించారు. 

వేములవాడ ఆలయ అభివృద్ధికి శృంగేరి, కంచి కామకోటి పీఠాల సూచనలను స్వీకరిస్తానని చెప్పారు. ఈ క్రమంలో 2016 ఫిబ్రవరిలో వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(వీటీడీఏ)ని ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో దాదాపు రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన 13 అంశాలతో కూడిన పనుల ప్రతిపాదనలను రూపొందించారు. వీటికి అదనంగా సాగునీటి పారుదల శాఖ తరఫున మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రూ.63 కోట్లతో గుడి చెరువు ట్యాంక్‌బండ్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, తర్వాత ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.90.34 కోట్లకు పెంచారు. అయితే.. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల డిజైన్లు పూర్తి స్థాయిలో ఖరారు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇదిలా ఉంటే 2022-23 వార్షిక బడ్జెట్‌లో Vemulawada temple Area Development Authority రూ. 50 కోట్లు కేటాయించారు. ఇక, రాజన్న ఆలయ అభివృద్దిపై దృష్టిసారించనున్న కేసీఆర్.. త్వరలోనే వేములవాడలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్