
హైదరాబాద్ : House tax కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిమీద దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన Peerjadiguda నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ వీధి నంబర్-8లోని మురళి అపార్టుమెంటులోని ఓ ప్లాట్ లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు.
సదరు ప్లాట్ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీలోపు ఇంటిపన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయాన్ని ప్లాట్ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్టలేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దైర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకుంటాం..
మార్చి 31వ తేదీ లోపు ఇంటిపన్ను 100శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్ కలెక్టర్లు, సిబ్బంది మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని పీర్జాదిగూడ కమిషనర్, రామకృష్ణారావు అన్నారు.
ఇదిలా ఉండగా, మార్చి 25న జగిత్యాలలో ఇలాంటి ఘటనే జరిగింది. Property Tax చెల్లించడం లేదని Municipal Staff ఓ ఇంటిముందు చెత్త పోసిన ఘటన Jagtial జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని పురాణిపేటకు చెందిన హైమద్ బిన్ సాలెం ఇంటి మీద రూ. 54వలే ఆస్తిపన్ను బకాయి ఉంది. అయిదు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.1.04 లక్షలు చెల్లించాల్సిందిగా పురపాలక అధికారులు పలుమార్లు కోరారు. వారింట్లో ఇటీవల ఇద్దరు మృతి చెందడం, స్థానికంగా వారు ఎక్కువగా ఉండకపోవడంతో చెల్లింపులో జాప్యం జరిగింది. గురువారం పన్ను చెల్లించాలని పురపాలక సిబ్బంది కోరగా అప్పటికప్పుడు పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించలేమని, ప్రస్తుతానికి రూ.25 వేలు చెల్లిస్తామని హైమద్ బిన్ సాలెం చెప్పారు.
దీనికి వారు అంగీకరించకుండా బకాయి పూర్తిగా చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు ట్రాక్టర్ లో చెత్త తెప్పించి ఇంటిముందు కుప్పగా పోశారు. దీంతో సిబ్బందితో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరికి అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో చెత్తను పురపాలక సిబ్బంది తొలగించారు. ఈ సంఘటన మీద పురపాలక కమిషనర్ జె.స్వరూపారాణి సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేశారు.