కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు.. డయాలసిస్ పేషెంట్లకు కూడా: స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ కేసీఆర్ కానుకలు

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 5:18 PM IST
Highlights

తెలంగాణలో పింఛన్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పలు కానుకలను ప్రకటించారు.

తెలంగాణలో పింఛన్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పలు కానుకలను ప్రకటించారు. కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని కేసీఆర్. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుందన్నారు. 57 ఏళ్ల వయసు వాళ్లకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు పింఛను ఇస్తామని చెప్పారు. వారికి నెలకు రూ. 2,016 ఇస్తామని తెలిపారు. 

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ సత్ప్రవర్తన గల 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని చెప్పారు. అనాథ శరణాలయాల పిల్లలను స్టేట్ చిల్డ్రన్‌గా ప్రకటించారు. నేతన్నలకు బీమా కల్పించనున్నట్టుగా చెప్పారు. పాల మీద జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు. 28 శాతం జీఎస్టీ వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలని ప్రధానిని కోరుతున్నట్టుగా చెప్పారు. గాలి మీద తప్ప.. అన్నింటిపై పన్ను వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేసీఆర్ కీలక ప్రకటన

‘‘కేంద్ర ప్రభుత్వం ఉచితాలు బంద్ చేయాలని ఇప్పుడు కొత్త నినాదం ఎత్తుకుంది. వృద్దులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా?, రైతులు బాధలో ఉంటే.. రైతు బంధు ఇవ్వడం తప్పా?,  ఉచితాలు తప్పు అయితే ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారు. కొన్ని సంస్థలకు ఎన్‌పీఏల పేరిట రూ. 12 లక్షల కోట్లు ఇచ్చారు. రూ. 2 లక్షల కోట్ల ఎన్‌పీఏలు.. రూ. 20 లక్షల కోట్లకు ఎందుకు పెరిగింది?. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కై ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారు’’ అని కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

click me!