ఎమ్మెల్యేల కొనుగోలుపై జీఎస్టీ వేయండి.. నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ చురక..

By Bukka SumabalaFirst Published Aug 27, 2022, 9:00 AM IST
Highlights

దేశవ్యాప్తంగా బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని.. దీనిమీద జీఎస్టీ విధించాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చురక అంటించారు. 
 

హైదరాబాద్ : ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అనేక సామాజిక, రాజకీయ పరిణామాలు సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు. ఇటీవలి కాలంలో కేంద్రం చేస్తున్న పనుల మీద వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కూల్చివేతకు అన్ని రకాల వ్యవస్థలను ఉపకరణాలుగా వాడుకోవడం సరిపోలేదు అనుకుంటా…అదే తరహా తప్పును ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పునరావృతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

నిర్మలా సీతారామన్ గారు.. బీజేపీ చేస్తున్న బేరసారాలపై జిఎస్టి విధించేందుకు ఇదే సరైన సమయం’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘బిజెపి ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అంటే ఎమ్మెల్యేల కొనుగోలుపై దాదాపు రూ.6,300 కోట్లు వెచ్చించింది.ఈ ధనమంతా ఎక్కడి నుంచి వస్తున్నట్లు’ అని ఢిల్లీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారంలో అక్కడి ప్రభుత్వం కోత విధించనుందంటూ వస్తున్న వార్తలపై కేటీఆర్ మరో ట్వీట్లో స్పందించారు. 

నోటిఫికేషన్ల జారీలో ఆలస్యమెందుకు?.. మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి

‘జాతీయత గురించి పెద్దగా మాట్లాడే పార్టీ నుంచి ఈ తరహా నిర్ణయం రావడం బాధాకరం. దేశం కోసం ప్రాణాలు అర్పించే వీర సైనికుల త్యాగాలను ఆర్ధిక భారంగా పరిగణించకూడదు.  కర్ణాటక ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందని  ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. అలాగే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో కోణాల్లో మెరుగ్గా పని చేస్తున్నాయి. జనాభా సంఖ్య ఆధారంగా స్థానాలను పునర్వ్యవస్థీకరిస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందనే వాదన వింటున్నా..  అదే జరిగితే అంతకంటే అపహాస్యం మరొకటి ఉండదు’  అని కేటీఆర్ పేర్కొన్నారు. 

click me!