తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర‌ రచ్చ.. రేవంత్ అనుకున్నది సాధిస్తారా..?

Published : Mar 02, 2022, 10:39 AM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర‌ రచ్చ.. రేవంత్ అనుకున్నది సాధిస్తారా..?

సారాంశం

తెలంగాణ‌లో అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగిస్తూ.. మరోవైపు క్షేత్ర స్థాయిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ధీటుగా ఎదుర్కొవడానికి సిద్దమవుతుంది. అయితే నాయకుల మధ్య లోపిస్తున్న ఐక్యత క్యాడర్‌లో నిరాశను నింపుతున్నాయి.

తెలంగాణ‌లో అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగిస్తూ.. మరోవైపు క్షేత్ర స్థాయిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ధీటుగా ఎదుర్కొవడానికి సిద్దమవుతుంది. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటుగా.. వారికి పార్టీ అండగా ఉంటుందనే సంకేతాలను పంపాలని చూస్తున్నారు. గతంలో 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించి.. కాంగ్రెస్‌ను ఉమ్మడి ఏపీలో అధికారంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా తెలంగాణలో అధికారంలో రావడానికి అప్పటి మాదిరిగానే పాదయాత్ర చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 

పాదయాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ.. దానిని ఎవరూ చేపట్టాలనే దానిపై పార్టీలో తర్జనభర్జన కొనసాగుతుంది. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రవ్యాప్తంగా సధీర్ఘ పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు కొందరు నేతలు మద్దతు ఉన్నా.. మరికొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. 

రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. పార్టీలో కొందరు నేతలు ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు కామన్ అయినప్పటికీ.. కొందరు నేతలు రేవంత్ ఏది చేసినా తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు. రేవంత్ అందరినీ కలుపుకుని పోవడం లేదని.. ఆయన ధోరణి బాగోలేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్‌ను తమను పట్టించుకోవడం లేదనే  పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలోనే రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేపడితే క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వెళ్తుందని రేవంత్ వ్యతిరేకిస్తున్న నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ భాగస్వామ్యం అయ్యేలా పాదయాత్ర రూపకల్పన చేయాలని కోరుతున్నారు. ముఖ్యనేతలు వారికి పట్టు ఉన్న ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టాలనే వాదననే తెరపైకి తెస్తున్నారు. అయితే మరి దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉటుంది. అయితే రాష్ట్ర స్థాయిలో ఈ విషయంపై క్లారిటీ రాకుంటే.. అధిష్టానం జోక్యం చేసకోవాల్సి వస్తుందని టీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

భట్టి పాదయాత్ర.. 
ఇటీవల  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన నియోజవర్గం మధిరలో పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మార్చి పేరుతోల ఆయన మధిర నియోజకవర్గంలోనే 32 రోజుల పాటు ఈ పాదయాత్రను నిర్వహించనున్నట్టుగా తెలిపారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ విధానాలపై విరుచుకుపడుతూ.. ప్రజ సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు. అయితే భట్టి తన పాదయాత్రను ఇతర నియోజకవర్గాల్లో చేపడతారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు భట్టి చేసిన వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చేలా ఉన్నాయి. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి.. ప్రజా సమస్యలపై పోరాడతానని ఆయన చెప్పారు. అయితే భట్టి సీఎల్పీ నేతగా ఉండటం.. ఆయనపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత లేకపోవడం రేవంత్ వ్యతిరేక వర్గం ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు అడ్డుచెప్పరనే చర్చ సాగుతుంది. టీ కాంగ్రెస్‌లో మరి కొందరు నేతలకు పాదయాత్ర చేపట్టాలనే ఆకాంక్ష ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

రేవంత్ ప్లాన్స్.. 
2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలో తీసుకురావాలని భావిస్తున్న రేవంత్.. ఆ దిశలో తనదైన దూకుడుతో ముందుకు సాగాలని అనుకుంటున్నారు. సీనియర్ల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. వారిలో కొందరి అసంతృప్తిని  చలార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఏదో ఒక సాకుతో ఆయనను వ్యతిరేకిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఏది ఏమైనా ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటూ బలంగా పోరాడాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. అయితే దానిపై ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. 

మన ఊరు-మన పోరు (Mana Ooru Mana Poru) పేరుతో ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని భావిస్తున్నారు. శనివారం పరిగిలో నిర్వహించిన తొలి బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది. మరి రేవంత్ భావిస్తున్నట్టుగా పాదయాత్ర చేపడతారా..? లేకుంటే పార్టీ మరేదైనా వ్యుహం అనుసరిస్తుందా..?.. లేక గ్రూప్ రాజకీయాలతో పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకుంటారా..? అనేది త్వరలోనే తేలనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే