
ఈ రోజు లేదా రేపు ఇంటర్ పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy). జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ మారిందని.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై దాని ప్రభావం వుంటుందని చెప్పారు.
కాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2022 పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఏన్టీఏ.. ఈ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు వివిధ రాష్ట్రాల్లోని బోర్డు ఎగ్జామ్స్‌తో క్లాష్ కాకుండా ఉండేలా తాజా షెడ్యూల్ రూపొందించారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా వాటిని సవరిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. సవరించిన తేదీల ప్రకారం.. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష సెంటర్‌లకు సంబంధించిన నగరాల జాబితా సమాచారం ఏప్రిల్ మొదటి వారంలో తెలియజేయబడుతుందని ఎన్టీఏ తెలియజేసింది. 2022 ఏప్రిల్ రెండో వారం నుంచి admit card డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్టుగా తెలిపింది.
మరోవైపు JEE మెయిన్ 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకునేందకు అధికారులు వీలు కల్పించారు. ఫీజులను jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. కనీసం ఐదు సబ్జెక్టులతో ప్లస్ 2 పాసైన అభ్యర్థులు ఇంజనీరింగ్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా, తెలంగాణలో ఇంటర్మీడియట్ (telangana intermediate) విద్యార్థులకు మార్చి నెలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్నందున.. విద్యార్థులకు సంబంధిత కాలేజ్ లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కోవిడ్ ఉద్ధృతి కారణంగా గతేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్‌మెంట్‌లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
రెగ్యులర్ స్ట్రీమ్ ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం.. విద్యార్థులకు సంబంధిత కాలేజీల్లో ప్రాకికట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం కవర్ చేస్తూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నామని.. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేయనున్నారు. విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు ఇళ్ల వద్ద పూర్తి చేసి.. సంబంధిత కాలేజీల్లో సమర్పించాల్సి ఉంటుంది.