కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి : అలర్టైన ఇంటెలిజెన్స్ .. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు , అభ్యర్ధులకు అదనపు భద్రత

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు . బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కారు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్ధులకు భద్రత పెంచాలని నిర్ణయించారు.


బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అటు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఈ ఘటనతో అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కారు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్ధులకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు 2 ప్లస్ 2 భద్రత కల్పిస్తుండగా. దాడి నేపథ్యంలో దానిని 4 ప్లస్ 4కు పెంచాలని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణలోని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలకు ఆయన లేఖ రాశారు. 

మరోవైపు..  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్ధితిపై యశోదా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా వుందని చెప్పలేమని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు. ఐదు రోజుల పాటు ఇలాగే కొనసాగిస్తామని.. ప్రభాకర్ రెడ్డిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు వున్నాయని యశోదా వైద్యులు పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్ రావు.. యశోదా ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. 

Latest Videos

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటివి రాయలసీమ, బీహార్‌లోనే చూశామని, వీటిని తెలంగాణ సమాజం హర్షించదని హరీశ్ రావు స్పష్టం చేశారు. విపక్షాలు అధికార పక్షాన్ని అపహాస్యం చేస్తున్నాయని.. రెండ్రోజుల్లోనే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి వెనుక కుట్ర కోణాన్ని ఛేదిస్తారని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. 

ALso Read: నిలకడగా లేదు.. ఐసీయూలోనే చికిత్స : కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

కాగా.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన  రాజు అనే వ్యక్తి  మొబైల్ కాల్ డేటాను  పోలీసులు పరిశీలించనున్నారు. సోమవారం  దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో  ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని  తిరిగి వెళ్తున్న సమయంలో  కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన  ప్రభాకర్ రెడ్డి గన్ మెన్  దాడిని అడ్డుకున్నారు. లేకపోతే ప్రభాకర్ రెడ్డికి  తీవ్ర గాయాలై ఉండేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడితో ఆగ్రహంతో  రాజును  బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును  అదుపులోకి తీసుకున్నారు. 

తీవ్రంగా గాయపడిన రాజును సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో రాజు చికిత్స పొందుతున్నారు. మరో వైపు  వారం రోజులుగా  రాజు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు  ఆరా తీయనున్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందా, లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే  కోణంలో  పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి సికింద్రాబాద్  యశోదా ఆసుపత్రిలో  సోమవారం నాడు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆయనను సీఎం కేసీఆర్ పరామర్శించి.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  
 

click me!