తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్

By telugu teamFirst Published Jun 29, 2020, 10:26 AM IST
Highlights

తెలంగాణ హోం మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల క్రితం మహమూద్ అలీ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ హోం మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తమా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అలాగే, కాంగ్రెసు సీనియర్ నేత వి. హనమంతరావుకు కూడా కరోనా వైరస్ సోకింది. తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి చెెందుతోందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు అని అంటున్నారు. 

ఇదిలావుంటే, హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా వైరస్ దండిగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 15 రోజుల పాటు హైదరాబాదులో లాక్ డౌన్ విధించాలని ఆరోగ్య శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి 3,4 రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. 

పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనంత మాత్రాన భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, అందరికీ వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కేసీఆర్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వైరస్ రోగులకు అందిస్తు్నన చికిత్స, భవిష్యత్తు వ్యూహంపై చర్చించడానికి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. జిహెచ్ఎంసీ పరిధిలో మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని వైద్యాధికారులు, నిపుణులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. దానిపై కేసీఆర్ స్పందించారు. హైదరాబాదు కోటీ మంది నివసిస్తున్న పెద్ద నగరమని,  దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఉన్న పరిస్థితే హైదరాబాదులో ఉందని, అది సహజమని ఆయన అన్నారు. 

లాక్ డౌన్ తొలగించిన తర్వాత ప్రజల కదలికలు పెరిగాయని, దాంతో వైరస్ వ్యాపిస్తోంది, చెన్నైలో మళ్లీ లాక్ డౌన్ విధించారని, ఇతర నగరాల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయని ఆయన చెప్పారు. 

జిహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలంటే పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అన్ని విషయాలను పరిశీలించి లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వం అవసరమైన నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు. 

click me!