
తెలంగాణ మద్యం ధరల పెంపుపై అధికారిక ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతున్నట్టుగా ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే ఏ రకం మద్యంపై ఎంత ధర పెరిగిందనే విషయంపై ఎక్సైజ్ శాఖ స్పష్టత లేకుండా పోయింది. అయితే నేడు మద్యం ధరలు పెంపుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. అన్ని రకాల బీర్ బాటిల్స్‌కు ఎంఆర్‌పీపై రూ. 10 పెంచుతున్నట్టుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది.
మద్యం ధరల పెంపు ఇలా..
- రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్‌పీ ఉన్న మద్యం బ్రాండ్లపై.. 180 ఎంఎల్‌పై రూ. 40, 375 ఎంఎల్‌పై రూ. 80, 750 ఎంఎల్‌పై రూ. 160 చొప్పున ధర పెంపు
- రూ. 200 కంటే తక్కువ ఎంఆర్‌పీ ఉన్న మద్యం బ్రాండ్లపై.. 180 ఎంఎల్‌పై రూ. 20, 375 ఎంఎల్‌పై రూ. 40, 750 ఎంఎల్‌పై రూ. 80 చొప్పున ధర పెంపు
- వైన్ బ్రాండ్లపై.. బ్రాండ్లపై.. 180 ఎంఎల్‌పై రూ. 10, 375 ఎంఎల్‌పై రూ. 20, 750 ఎంఎల్‌పై రూ. 40 చొప్పున ధర పెంపు
తెలంగాణ సర్కార్ చివరిగా 2020 మే లో మద్యం ధరలను పెంచింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి మద్యం ధరలను మరోసారి పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని.. పాత ఎంఆర్‌పీ ధరలు ఉన్నప్పటికీ కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ధరల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏవైనా సమస్యలు ఉంటే 1800 425 2523 నెంబర్‌కు సంప్రదించాలని సూచించింది.
ఇక, ధరల పెంపు కారణంగా బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వైన్స్, బార్, రెస్టారెంట్లను ఆబ్కారీశాఖ అధికారులు సీజ్‌చేశారు. ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలు సేకరించారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి తెచ్చుకున్న స్టాక్‌కు కొత్త ధరలు అమలు చేయడంలో భాగంగా వివరాలు తీసుకున్నారు. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్‌కు అనుగుణంగా దుకాణదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.