
తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రూప్-4 కింద 9,618 పోస్టుల భర్తీపై ఈ సమీక్షలో సీఎస్.. అధికారులతో చర్చించారు. ఈ నెల 29 వరకు వివరాలు కమిషన్‌కు పంపాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు. ఆ తర్వాత గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇక, తెలంగాణలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా ఈ ఏడాది మార్చి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. పోలీస్ రిక్రూట్‌మెంట్, గ్రూప్-1.. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మిగిలిన పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గ్రూప్స్ పోస్టుల విషయానికి వస్తే.. గ్రూప్1- 503, గ్రూపు 2- 582, గ్రూప్ 3- 1,373, గ్రూప్ 4- 9,168 ఉన్నాయి. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇక, గ్రూప్-2 పోస్టులతో పాటు గ్రూపు-3 పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీకి సూచన కూడా చేసినట్టుగా సమాచారం. గ్రూప్-2లో 582 పోస్టులు, గ్రూప్-3లో 1373 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటికి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడం కంటే, ఈ రెండు గ్రూపుల్లోని పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.