కరోనా పరిస్థితులపై విచారణ: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

By telugu teamFirst Published May 17, 2021, 1:15 PM IST
Highlights

తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మీద హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించింది. ధరల నియంత్రణపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

హైదరాబాద్: కరోనా వ్యాధికి చికిత్స విషయంలో అమలవుతున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో బెడ్స్ పరిస్థితిపై వెబ్ సైట్ లో ఓ రకంగా, క్షేత్ర స్థాయిలో మరో రకంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలో కరోనా పరిస్థితిపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.  వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టడం లేదని, వ్యాక్సినేషన్ డ్రైవ్ లో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్లు అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలపై మొదటి దశలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుతం పరిస్థితిలో చర్యలు తీసుకోవడం లేదని వారన్నారు. 

ధరల నియంత్రణపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో సరిపోదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ ను అత్యవసర మందుల జాబితాలో చేర్చాలని సూచించింది. నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా సీటీ స్కాన్, ఇతర పరీక్షలకు సంబంధించిన ధరలను కూడా నిర్ణయించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు చేపట్టిన విచారణకు హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్ వీడియోగ్రఫీని ముగ్గురు కమిషనర్లు కూడా హైకోర్టుకు సమర్పించారు. జైళ్ల శాఖలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పూర్తిపై కోర్టుకు నివేదికలు సమర్పించారు. 

కేంద్రం నుంచి 650 మెట్రిక్ ట్నుల ఆక్సిజన్, 10 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు వస్తున్నాయని సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. మల్లాపూర్ లో గర్భిణీ స్త్రీ మృతిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి వివరాలు అందించాలని ఆదేశించింది.

click me!