అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
అప్పు ఓ యువకుడి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. కుటుంబంలో కలతలు రేపింది. భార్యభర్తల మధ్య గొడవలకు కారణమయ్యింది. చివరికి యువకుడి బలవన్మరణానికి దారి తీసింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా హసన్ పర్తిలో చోటు చేసుకుంది. కాగా యువకుడి తల్లిదండ్రులు మాత్రం దీనిమీద అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.
వివరాల్లోకి వెడితే.. అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. అరెపల్లికి చెందిన సుంకరి సదానందం చిన్న కుమారుడు కమల్ (34) అక్షయపాత్రలో విధులు నిర్వహించేవాడు.
కమల్ ఇటవల కుమార్ పల్లిలో కొత్త ఇళ్లు నిర్మాణం చేపట్టాడు. అందుకు రూ.12 లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, ఈనెల 14న భార్యతో గొడవపడి ఇంటినుంచి వెళ్లి పోయాడు. వివిధ ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లబించలేదు.
ఈ క్రమంలో ఆదివారం ఆరెపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ యువకుడు కాలిన గాయాలతో మృత చెందినట్లు సమాచారం అందడంతో, వెళ్లి పరిశీలించి అది కమల్ మృతదేహంగా గుర్తించారు.
మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. తన కుమారుడి మృతి మీద అనుమానం ఉందని.. మృతుడి తండ్రి సదానందం ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రావు తెలిపారు.