ఎల్ బీ నగర్ లో మహిళపై దాడి ఘటనను సుమోటోగా తీసుకుంది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 15వ తేదీన మహిళలను ఎల్ బీ నగర్ పోలీసులు తీసుకెళ్లి దాడికి దిగారు.
హైదరాబాద్: ఎల్ బీ నగర్ లో గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసులు దాడి చేసిన ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.ఈ ఘటనపై జడ్జి సూరేపల్లి నంద తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీంతో ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుంది హైకోర్టు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేసే అవకాశం ఉంది.
ఈ నెల 15వ తేదీన ఎల్ బీ నగర్ చౌరస్తాలో ముగ్గురు మహిళలు స్థానికంగా ఇబ్బంది కల్గిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మీర్ పేట కు చెందిన మహిళ లక్ష్మిని పోలీసులు తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులపై ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది.
తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఈ విషయమై బాధితురాలి కుటుంబ సభ్యులు ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందే ఈ నెల 16న ఆందోళనకు దిగారు.ఈ విషయమై రాచకొండ సీపీ చౌహాన్ విచారణకు ఆదేశించారు. ఈ విషయమై ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఈ విషయమై 324, 354, 379, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
also read:ఎల్బీ నగర్‌లో గిరిజన మహిళపై పోలీసుల దాడి: ఇద్దరిని సస్పెండ్ చేసి సరిపెట్టారు: ఈటల రాజేందర్
ఈ ఘటన గురించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీరియస్ గా స్పందించారు. పోలీసుల తీరుపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బాధితురాలిని పలు పార్టీల నేతలు పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రెండు రోజుల క్రితం సాగర్ రోడ్డులో ఆందోళనకు దిగారు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.