
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున బరిలోకి దిగే అభ్యర్థులను సోమవారం ప్రకటించారు. అయితే ఆ లిస్టులో తమ పేరుంటుందని కొందరు అభ్యర్థులు ఆశించి భంగపడ్డారు. అలాంటి అసంతృప్తులను శాంతింపజేసి, వచ్చే ఎన్నికలో ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. ఇందులో పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తరువాత ఆ స్థానం కాళీగానే ఉంది. ఆ స్థానంలోనే పట్నం మహేందర్ రెడ్డిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇది కూడా ఈ ఒకటి, రెండు రోజుల్లో జరిగిపోతుందని సమాచారం. గవర్నర్ తమిళసై అందుబాటులో ఉన్న సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.
వాస్తవానికి మహేందర్ రెడ్డి తాండురు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డికే టికెట్ కేటాయించింది. దీంతో ఆయనను శాంతింపజేయడానికి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు మహేందర్ రెడ్డితో చర్చలు జరిపారని, ఆయన సమ్మతించాకే ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత తాండూరు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిమాణాలు నెలకొన్నాయి. కొన్నాళ్ల నుంచి ఉప్పు, నిప్పులా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి స్వీట్లు తినిపించుకుంటూ, ఒకే గజమాలలో ఒదిగిపోయి కనిపించారు. తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రోహిత్ రెడ్డి పేరు ప్రకటించిన వెంటనే ఆయన.. శాలువ, స్వీట్లు, గజమాల తీసుకొని మహేందర్ రెడ్డికి నివాసానికి వెళ్లారు. సన్మానం చేసి, తన గెలుపనకు సహకరించాలని కోరారు. ఇద్దరూ ఇలా కలిసిపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.