రోజుకు 50 వేలు టెస్టులు చేయాల్సిందే: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

By Siva KodatiFirst Published Mar 18, 2021, 5:08 PM IST
Highlights

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కొవిడ్‌ కేసులు ఎక్కువ వచ్చే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రతినిత్యం 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది.

రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయని.. పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రోజూ 50 వేల పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని వాదనలు వినిపించారు.

అంతేకాకుండా ఈ నెల 7, 11, 12, 13 తేదీల్లో వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లలో 50వేల పరీక్షలు నిర్వహించినట్లు లేదని తెలిపారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని ప్రభాకర్ కోరారు.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సమయంలో, పోలింగ్ రోజు కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రభాకర్ చెప్పారు. త్వరలో హోలీ పండగ కూడా రాబోతోందని.. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

సొంతంగా సేరో సర్వేలెన్స్ సర్వే చేయడానికి సమయం కావాలని ఏజీ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో  వున్నారని.. రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్ స్టేషన్‌లో 300 మొబైల్ బస్సుల్లో టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఏజీ వెల్లడించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం పబ్లిక్ సమూహాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంత్యక్రియలు, పెళ్లిళ్లలో 100 మందికి మించి పాల్గొనరాదని సూచించింది.

రద్దీ ప్రాంతాల్లో, నిర్మాణ ప్రాంతాలు, పాఠశాలల వద్ద టెస్టులు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించింది.

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజూ బులెటిన్ విడుదల చేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. 

click me!