తెలంగాణ హైకోర్టు బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై అసహనం వ్యక్తం చేసింది. గంగుల కమలాకర్ పై బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పై పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ బండి సంజయ్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. మంత్రి గంగుల కమలాకర్ పై ఎంపీ బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు బండి సంజయ్ ఇవాళ హాజరు కాలేదు. అమెరికా పర్యటనలో ఉన్నందున బండి సంజయ్ ఇవాళ హైకోర్టుకు హాజరు కాలేదు.
దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు సమయం కావాలని హైకోర్టును బండి సంజయ్ తరపు న్యాయవాది కోరారు. ఇప్పటికే మూడు దఫాలు సమయం కోరిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అమెరికా పర్యటనలో ఉన్నందున బండి సంజయ్ ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేదని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నెల 12న క్రాస్ ఎగ్జామినేషన్ కు బండి సంజయ్ హాజరౌతారని హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల పిటిషన్లను ఆరు మాసాల్లో తేల్చాల్సి ఉందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
అయితే రూ. 50 వేల సైనిక సంక్షేమ నిధికి జమ చేయాలని హైకోర్టు బండి సంజయ్ ను ఆదేశించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే రూ. 50 వేలను సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.ఈ ఏడాది జూలై 21 నుండి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం బండి సంజయ్ మూడు వాయిదాలు కోరారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై విజయం సాధించారు.