వర్షాల వేళ కరెంటుతో జర భద్రం.. టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి రఘుమారెడ్డి...

By SumaBala Bukka  |  First Published Sep 5, 2023, 1:05 PM IST

తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ పంపిణీ సంస్థ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. స్వీయజాగ్రత్తలు పాటించాలని తెలిపింది. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి రఘుమారెడ్డి సూచించారు. ఈ మేరకు  మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్  పరిధిలో చీఫ్ జనరల్ మేనేజర్, సూపర్డెంట్ ఇంజనీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగించే సమయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సాధారణ ప్రజలను రఘుమారెడ్డి కోరారు.  దీనికి సంబంధించి పలు సూచనలు కూడా ఆయన ప్రజలకు చేశారు.

Latest Videos

undefined

- వర్షాలు పడుతున్న సమయంలో విద్యుత్ కు సంబంధించిన పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తెలిపారు.  స్టే వైర్, ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్ల కింద నిలబడ కూడదని.. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

- పెంపుడు జంతువులు, పశువులను కూడా విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. వర్షాలు ఈదురుగాలులకు రోడ్లమీద  కరెంటు వైర్లు తెగిపడినా.. నీటిలో వైర్లు కనిపించినా.. వాటిని తొక్కడం.. కాలు పెట్టడం, వాటి మీద నుంచి వాహనాలు నడిపించడం చేయకూడదని తెలిపారు.

- తెగిపడిన వైర్లు గమనిస్తే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని… లేకపోతే హెల్ప్ లైన్ ల ద్వారా  సమాచారం అందించాలని తెలిపారు.

- భవనాలు, వాహనాలు, చెట్ల కొమ్మల మీద విద్యుత్ వైర్లు తెగిపడినట్లయితే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.

- భారీగాలులు, వర్షాల సమయంలో విద్యుత్ సరఫరాలలో అంతరాయం ఏర్పడుతుంది. హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. అలాంటి సమయాల్లో ఇంట్లోని విద్యుత్ పరికరాలను వీలైనంతవరకు ఆఫ్ చేసి పెట్టాలని... వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని తెలిపారు.

- ఇలాంటి ఫిర్యాదులను కంట్రోల్ రూమ్ కు ఇచ్చే ముందు వినియోగదారులు యూఎస్సీ నెంబర్ ను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ నెంబరు వారి ఇంటి కరెంటు బిల్లు మీద ఉంటుందని తెలిపారు.

- అపార్ట్మెంట్ సెల్లార్లలోకి, లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.

- విద్యుత్కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా సంస్థకు సంబంధించిన మొబైల్ యాప్ వెబ్సైట్ సోషల్ మీడియాల ద్వారా సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.

- వీటితోపాటు అత్యవసర పరిస్థితి ఉంటే 1912, 100 స్థానిక ఫ్యూస్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు  73820 72104, 73820 72106, 73820 71574 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

click me!