వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణ సమయంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రికార్డులు, ఫైల్స్ ను ఈ నెల 13వ తేదీలోపుగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పలు అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇప్పటికే రెండు దఫాలు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండు దఫాల సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ విషయంలో అనుమానాలున్నాయన్నారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ పై సీబీఐ అధికారుుల సంతకాలు తీసుకోలేదన్నారు. అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారి ఈ స్టేట్ మెంట్ ను ఎడిట్ చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా అవినాష్ రెడ్డి న్యాయవాది కోరారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేశారా అని సీబీఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ఆడియో, వీడియో రికార్డ్ చేసినట్టుగా సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. అయితే ఈ విషయమై అధికారులతో మాట్లాడి లంచ్ బ్రేక్ తర్వాత చెప్పాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
also read:వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ సునీతా ఇంప్లీడ్ పిటిషన్
ఈ పిటిషన్ పై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ అయింది. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం సునీతారెడ్డి న్యాయవాది వాదనలు విన్పించనున్నారు. సీబీఐ కార్యాలయంలో సీసీ కెమెరాలున్నాయా లేవా అనే విషయమై అనుమానాలున్నాయని అవినాష్ రెడ్డి న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విచారణ సమయంలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అనుమానం ఉందని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీబీఐ విచారణ అధికారిపై అనుమానాలున్నాయని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. మరో వైపు వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో దొరికిన లేఖను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. లంచ్ బ్రేక్ తర్వాత వైఎస్ సునీతారెడ్డి, సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలను విన్పించనున్నారు.