టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు..

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 3:29 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్మూరి వెంకట్ తెలంగాణ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ కోర్టును కోరారు. సుప్రీం కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

ఇక, టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ లీకేజీపై దర్యాప్తునకు సీబీఐని ఆదేశించాలని కోరుతూ బల్మూరి వెంకట్ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ కావడం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని.. తద్వారా ఔత్సాహిక యువ అభ్యర్థులు పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారని తెలిపారు. ఇది వ్యవస్థీకృత నేరమని అన్నారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది, డబ్బు కోసం ఇతర కుట్రదారుల అండతో జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

టీఎస్‌పీఎస్సీలో తరచూ జరిగే పేపర్‌ లీకేజీలు యువ ఔత్సాహిక అభ్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థ చేత ఏఈ పరీక్ష పేపర్ లీక్‌పై విచారణ జరిపించాలని కోరారు. 

click me!