
ధాన్యం కొనుగోళ్లకు (paddy procurement) సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ (trs) సర్కార్ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై రాస్తారోకో, ధర్నాలు నిర్వహిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనల వల్ల ప్రజా జీవితానికి ఇబ్బంది కలుగుతుందని పలువురు హైకోర్టులో (telangana high court) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అనుమతి లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తోందని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ధర్నాలతో ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతుందని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై జోక్యం చేసుకున్న కోర్టు.. ఆందోళనలకు అనుమతులున్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి హోంశాఖ సమాధానమిస్తూ.. రాస్తారోకోలకు అనుమతి ఇవ్వలేదని న్యాయస్థానానికి తెలిపింది. తమ దృష్టికి వచ్చిన వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది. ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతి వుండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనుమతి లేని ఆందోళనలను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కాగా.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలోని జాతీయ రహదారులను టీఆర్ఎస్ దిగ్భంధనం చేసింది. National Higy Ways పై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా టీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే మండల కార్యాలయాల్లో నిరసన దీక్షలను చేసింది. ఇవాళ జాతీయ రహదాదారుల దిగ్భంధనానికి టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా నాగపూర్, బెంగళూరు, విజయవాడ, ముంబై హైవేలను దిగ్భంధనం చేయాలని టీఆర్ఎస్ నిర్ణ తీసుకొంది. ఈ జాతీయ రహాదారులున్న జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ రాస్తారోకోల్లో పాల్గొన్నారు.
హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇదే జిల్లాలోని కోదాడ వద్ద కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో రహదారిని దిగ్భంధించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరో వైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బెంగుళూరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి Srinivas Goud సహా పలువురు ఎమ్మెల్యేలు జాతీయ రహాదారిపై బైఠాయించారు.
జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమంతో ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి జాతీయ రహదారులను దిగ్భంధనం చేస్తామని ముందుగానే ప్రకటించింది. అయితే జాతీయ రహదారులపై ఇతర రాష్ట్రాల నుండి కూడా వాహనదారులు వస్తారు. అయితే ఈ విషయం తెలియని వాహనదారులు ఈ రాస్తారోకోలతో ఇబ్బంది పడ్డారు.