
Indrakaran Reddy: నిర్మల్ లో రాగుల పానీయ పంపిణీ కేంద్రాన్ని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాకాల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడారు. నిరుపేదలకు సేవ చేస్తున్న పాకాల రాంచందర్ అని కొనియాడారు. నిర్మల్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ పాకాల ఫౌండేషన్ చైర్మన్ రాంచందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగుల పానీయ పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. రాంచందర్ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ సంస్థను స్థాపించారు.
అలాగే, రాంచందర్ 2016 నుండి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని, పానీయం అందించడం ద్వారా ప్రజలకు వేడిగాలుల పరిస్థితుల నుండి ఉపశమనం కలిగించారని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. రెండు నెలల పాటు జొన్న, రాగి గింజలతో తయారు చేసిన పానీయాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాంచందర్‌ను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యే రేఖానాయక్, పారిశ్రామికవేత్త ఎ.మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డి.రాజేందర్, నిర్మల్ పట్టణ టీఆర్ ఎస్ అధ్యక్షుడు మరుగొండ రాము, కౌన్సిలర్లు సలీమ్, వేణు, నవీన్ సహా పలువురు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచడం, అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం తెలంగాణ రాష్ట్రానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు.
అంతకు ముందు తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రంపై పోరుకు సిద్ధమైందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా కేంద్ర తీరును పై నిరసన తెలుపుతూ.. వరి పంటను సేకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పోరాటాన్ని ప్రారంభించిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
బుధవారం కడ్తాల్ గ్రామం వద్ద హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాలుపంచుకున్నారు. అక్కడ కేంద్రంలోని ప్రధాని మోడీ బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్‌లో వరి పంటలను కొనుగోలు చేయరాదన్న కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు.